AP Dy CM Pawan kalyan: పల్లె పండుగ 2.0తో ఏపీ గ్రామీణ ప్రాంతాలకు కొత్త ఊపిరి
ఏపీ గ్రామీణ ప్రాంతాలకు కొత్త ఊపిరి
రూ.6,700 కోట్లతో 53 వేల అభివృద్ధి పనులు – 8 వేల కి.మీ. రోడ్లు, 25 వేల మినీ గోకులాల నిర్మాణం
గిరిజన గ్రామాలకు రూ.1,005 కోట్లతో రహదారులు – ఎకో టూరిజం, ఆలయ పర్యాటకంపై దృష్టి
AP Dy CM Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కొత్త ఊపిరి పోసేందుకు 'పల్లె పండుగ 2.0' కార్యక్రమం ద్వారా రూ.6,700 కోట్లతో 53,382 అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 8 వేల కిలోమీటర్ల రహదారులు, 25 వేల మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం జరుగనుందని ఆయన వెల్లడించారు.
పల్లె పండుగ 1.0లో ఇప్పటికే 4,300 కిలోమీటర్ల రహదారులు, 22,500 మినీ గోకులాలు, 15 వేలకు పైగా నీటి తొట్టెలు, లక్షకు పైగా నీటి కుంటల నిర్మాణం పూర్తయిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఇప్పుడు పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సాస్కీ పథకం కింద రూ.2 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, పీఎం జన్‌మన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో కలిపి రూ.1,005 కోట్లతో 635 గిరిజన గ్రామాలకు 1,069 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తోంది. 'అడవి తల్లి బాట' కార్యక్రమం ద్వారా కొండలపై ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్లు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి వివరించారు.
జలజీవన్ మిషన్‌ను 'అమరజీవి జలధార'గా నామకరణం చేసిన ప్రభుత్వం, చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.7,910 కోట్లతో ఐదు ప్రాజెక్టులను చేపట్టింది. 2027 నాటికి ఇవి పూర్తి చేసి 1.20 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయాలన్నది లక్ష్యమని పవన్ కల్యాణ్ తెలిపారు.
స్వచ్ఛ భారత్‌లో భాగంగా 28 స్వచ్ఛరథాల సంఖ్యను మరింత పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 2 లక్షల కిలోల పొడి వ్యర్థాలు సేకరణ జరిగింది. పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించడంతో పాటు 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, 77 డీడీవో కార్యాలయాల స్థాపన, ఉద్యోగులకు శిక్షణ ద్వారా దేశంలో నంబర్ వన్ స్థానం సాధించామని గుర్తుచేశారు.
గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యాటక శాఖల సమన్వయంతో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.35.19 కోట్లతో దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలకు ఈ నెల 3న శంకుస్థాపన జరుగనుంది.
అటవీ సంరక్షణలో భాగంగా ఏనుగుల బెడద నివారణకు కుంకీ ఏనుగులకు శిక్షణ, కృత్రిమ మేధతో సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. వన మహోత్సవంలో కోటి మొక్కల నాటింపు, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ కార్యక్రమంతో తీరప్రాంత సంరక్షణ, ప్రస్తుతం 33 శాతంగా ఉన్న గ్రీన్ కవర్‌ను 2047 నాటికి 50 శాతానికి పెంచే లక్ష్యం నిర్దేశించామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడం, మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణకు హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం, అటవీ అమరవీరుల కుటుంబాలకు రూ.5 కోట్ల సంక్షేమ నిధి వంటి చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.