Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను రోబోటిక్స్ తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ రోబోటిక్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీ’ని ఖరారు చేసింది. సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఈ నిబంధనలు 2026 నుంచి 2036 వరకు పదేళ్లపాటు అమల్లో ఉంటాయని, అవసరాన్ని బట్టి మార్చుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. రోబోటిక్స్ తయారీలో ఉన్న అంతరాలను తగ్గించి ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రాన్ని 2036 నాటికి ప్రముఖ రోబోటిక్స్ తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడం, కీలక విడిభాగాల నుంచి సిస్టమ్ ఇంటిగ్రేషన్ వరకు పూర్తి వాల్యూ చైన్‌ను అభివృద్ధి చేయడం పాలసీ ప్రధాన లక్ష్యం. ఇండస్ట్రియల్ ఆర్మ్స్, కొలాబరేటివ్ రోబోట్లు, డెల్టా రోబోట్లు, స్వయం ప్రతిపత్తి మొబైల్ రోబోట్లు, ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్స్, వేర్‌హౌస్, వ్యవసాయ, వైద్య సహాయక రోబోట్లతో పాటు విడిభాగాలు, సాఫ్ట్‌వేర్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ సేవలు అందించే సంస్థలకు ఈ పాలసీ వర్తిస్తుంది. ఏపీ రోబోటిక్స్ తయారీ పార్కులో పెట్టుబడి పెట్టే సంస్థలకు, అనుబంధ యూనిట్లకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. పార్కు వెలుపల ఏర్పాటు చేసే వాటికి ప్రోత్సాహకాలు వర్తించవు.

స్థిర మూలధన పెట్టుబడిపై (ఎఫ్‌సీఐ) భారీ ప్రోత్సాహకాలు కల్పించారు. రూ.50-200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే సబ్-లార్జ్ ప్రాజెక్టులకు 30 శాతం, రూ.200-1,000 కోట్ల లార్జ్ ప్రాజెక్టులకు 35 శాతం, రూ.1,000-5,000 కోట్ల మెగా ప్రాజెక్టులకు 40 శాతం ప్రోత్సాహకం ఇస్తారు. రూ.5 వేల కోట్లకు మించి పెట్టుబడి పెట్టే అల్ట్రా మెగా ప్రాజెక్టులకు టైలర్‌మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఐదేళ్లపాటు ఎస్‌జీఎస్‌టీ పూర్తిగా మినహాయింపు, పదేళ్లపాటు వినియోగించిన విద్యుత్‌కు యూనిట్‌కు రూపాయి చొప్పున తిరిగి చెల్లింపు, స్టాంప్ డ్యూటీ పూర్తిగా తిరిగి చెల్లింపు కూడా ఉంటాయి.

విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు నైపుణ్యాభివృద్ధికి చేసిన ఖర్చులో 75 శాతం మినహాయింపు లభిస్తుంది. పరిశ్రమలు నైపుణ్యం కోసం చేసిన ఖర్చులో ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఆరు నెలల పాటు చెల్లిస్తారు. రోబోటిక్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, శిక్షణ సంస్థలు కూడా ఈ పాలసీ పరిధిలోకి వస్తాయి. డ్రోన్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఈవీ, డీప్‌టెక్ వంటి ఇతర పాలసీలతో పాటు ఇది రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి బలమైన పునాది వేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ స్థాయి పోటీతత్వం, ఎగుమతుల కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం, జాతీయ-అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, నైపుణ్యాభివృద్ధి, దేశీయ డిమాండ్ పెంచడం పాలసీ ఉద్దేశాలు. ఈ విధానం వల్ల రోబోటిక్స్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్రం టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags: