Minister Atchannaidu: అక్వాన్ తుపాను ముప్పు: పంటల రక్షణకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
కీలక ఆదేశాలు
Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్వాన్ తుపాను ముప్పు పొంచియున్న నేపథ్యంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావం వల్ల పంటలకు నష్టం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. రైతుల పంటలు, మత్స్యకారుల ప్రాణాలు, వారి జీవనోపాధిని కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కూడా హెచ్చరించారు.
ఏపీ రాష్ట్రానికి అక్వాన్ తుపాను ముప్పు పొంచియున్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా ముందు జాగ్రత్తగా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 23.87 లక్షల హెక్టార్లలో సాగులో ఉన్న వ్యవసాయ పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంతంలోని 10 జిల్లాల వ్యాప్తంగా 9.15 లక్షల హెక్టార్లలో గల వ్యవసాయ పంటల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తుపాను ప్రభావిత 16 జిల్లాల్లో గల 2.69 లక్షల హెక్టర్లలో సాగులో ఉన్న ఉద్యానవన పంటలపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను ముందుగానే కోసి సురక్షిత ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు తుపాను కారణంగా ఉద్యానవన పంటలకు నష్టం కలిగితే 24 గంటల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. వారం రోజుల్లో రైతులవారీగా పూర్తి వివరాలను అందించాలని స్పష్టం చేశారు.
అంతేకాకుండా తుపాను నేపథ్యంలో మత్స్యకారులు కూడా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం 30,808 మత్స్యకార బోట్లలో 30,635 బోట్లు సురక్షితంగా తీరం చేరాయని, మిగిలిన 173 బోట్లపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని, నాభిమిత్ర ద్వారా 8,217 బోట్ల ట్రాకింగ్‌ను చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
రైతులు, మత్స్యకారుల జీవనోపాధి కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. తీరప్రాంత జిల్లాల్లో పంటల రక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉద్యానవన పంటలపై కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం రైతులు, మత్స్యకారుల పక్షాన ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.