AP High Court Order: హైకోర్టు ఆదేశం: మిగిలిన గోడ కూల్చేందుకు రూ.32 లక్షలు జమ చేయండి

రూ.32 లక్షలు జమ చేయండి

Update: 2025-11-07 06:29 GMT


విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి, అవ్యాన్ రియల్టర్స్‌కు డైరెక్షన్

పర్యావరణ నష్టానికి రూ.17.46 కోట్లపై అభ్యంతరాలు చెప్పేందుకు 2 వారాల గడువు

రెస్టోబార్ల షోకాజ్‌పై త్వరలో ఆర్డర్లు జారీ చేయండి: జీవీఎంసీకి ఆదేశం

ఇప్పటికే రూ.48.21 లక్షలు చెల్లించినట్లు తెలిపిన నేహా కంపెనీ

AP High Court Order: విశాఖ భీమిలి బీచ్ సమీపంలో సీఆర్‌జడ్ నియమాలు ఉల్లంఘించి నిర్మించిన కాంక్రీట్ గోడ మిగిలిన భాగాన్ని కూల్చివేయడానికి రూ.31.97 లక్షలు రెండు వారాల్లో జీవీఎంసీకి జమ చేయాలని ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమె అవ్యాన్ రియల్టర్స్ కంపెనీని ఆదేశించింది.

పర్యావరణానికి నష్టం వాటిల్లించినందుకు రూ.17.46 కోట్ల జరిమానా విధిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ (ఎంఓఈఎఫ్) కమిటీ ఇచ్చిన నివేదికపై అభ్యంతరాలు తెలపడానికి మరో రెండు వారాల సమయం కల్పించింది. ఎంఓఈఎఫ్ తుది నిర్ణయం అనంతరం అసంతృప్తి ఉంటే తగిన ఫోరమ్‌లో సవాలు చేసుకునే అవకాశం కల్పించింది.

అదే స్థలంలోని రెస్టోబార్లకు జీవీఎంసీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు యజమానులు ఇచ్చిన సమాధానాలను పరిశీలించి రెండు వారాల్లో తగిన ఉత్తర్వులు వెలువరించాలని జీవీఎంసీ అధికారులను ధర్మాసనం డైరెక్ట్ చేసింది. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

గత విచారణలో గోడ కూల్చివేతకు ఇప్పటివరకు అయిన రూ.48.21 లక్షలు జమ చేయాలని ఆదేశించగా.. ఆ మొత్తం చెల్లించినట్లు నేహారెడ్డి కంపెనీ కోర్టుకు తెలిపింది.

వాదనలు ఇలా..

నేహారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్: ‘‘మిగిలిన గోడ కూల్చేందుకు జీవీఎంసీ రూ.31.97 లక్షలు అడిగింది. రూ.17.46 కోట్ల జరిమానా నివేదికపై అభ్యంతరాలు చెప్పేందుకు మరికొంత టైం కావాలి.’’

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి: ‘‘ఇప్పటివరకు రూ.48.21 లక్షలు చెల్లించారు. మిగిలిన భాగం కూల్చేందుకు రూ.31.97 లక్షలు ఖర్చవుతుందని నోటీసు ఇచ్చాం.’’

Tags:    

Similar News