AP Liquor Scam : కీలక దశకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు
ఇవాళో రేపో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కీలక నేత అరెస్ట్ కు రంగం సిద్దమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అనేక మందిని వివిధ కేసుల్లో అరెస్టు చేశారు. ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెపుతూ కూటమి సర్కార్ పెట్టిన మద్యం కుంభకోణం కేసులో పలువురు వైసీపీ కీలక నేతలతో పాటు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ముఖ్యమైన అధికారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో తొలుత మాజీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి చుట్టూ పెనవేయాలని చూసినా ఆయన వైసీపీకి రాజీనామా చేయడంతో కూటమి ప్రభుత్వం ఎక్కుపెట్టిన బాణాన్ని మరోవైపు తప్పి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ వైపు ఎయిమ్ చేశారు.
ఈ క్రమంలో మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో నాలుగొవ నిందితుడిగా చేర్చారు. దీంతో ఎంపీ మిథుణ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ను డిస్మిస్ చేసింది. కోర్టు మిథున్ రెడ్డి పిటీషన్ తిరస్కరించిన గంటల వ్యవధిలోనే అతనిపై ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో మిథున్ రెడ్డి విదేశాలకు పారిపోకుండా సిట్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు చెపుతున్నారు. ఈ లెక్కన చూస్తే అతి త్వరలో లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది.
ఇప్పటికే లిక్కర్ కేసులో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డితో పాటు గత ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, సీయం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, బాలాజీ గోవిందప్పలను సిట్ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరందరూ జ్యుడిషియల్ కష్టడీలో ఉన్నారు. తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించడంతో ఇవాళో రేపో ఆయన అరెస్ట్ కూడా తప్పదని చెపుతున్నారు. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అరెస్ట్ కూడా తప్పదని అధికారవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.