AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కూడా రంగంలోకి దిగింది. సిట్, ఈడీల తర్వాత ఇప్పుడు ఐటీ అధికారులు ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మూలాలు, మనీ ట్రయల్‌పై దృష్టి సారించారు.

హైదరాబాద్‌లో సిట్, ఈడీ అధికారులతో ఐటీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. డొల్ల కంపెనీల ద్వారా భారీగా నగదు మళ్లించినట్లు, దుబాయ్ సహా పలు దేశాలకు సొమ్ము తరలించినట్లు దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. ఏ ఏ కంపెనీల ద్వారా సొత్తు మళ్లించారు, నిధులు ఎక్కడికి చేరాయి, విదేశాలకు, బినామీ సంస్థలకు సొమ్మును ఎలా తరలించారు అనే అంశాలపై ఐటీ వివరాలు సేకరిస్తోంది.

నిందితులు, డొల్ల కంపెనీలు, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల వివరాలను సిట్, ఈడీ నుంచి ఐటీ అధికారులు తీసుకున్నారు. కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను కూడా సేకరించనున్నారు. సేకరించిన సమాచారం ఆధారంగా తదుపరి చర్యలకు ఐటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

యాభై వేల కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్న ఈ కుంభకోణంలో సిట్, ఈడీల దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పుడు ఐటీ శాఖ కూడా చేరడంతో దర్యాప్తు మరింత తీవ్రమవుతుందని అధికార వర్గాలు అంటున్నాయి.

Tags: