Nara Lokesh: మంగళగిరిలో భారీ రైతుబజార్ ప్రాజెక్ట్ ప్రారంభం.. నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల రక్షణపై లోకేశ్ ఫోకస్
లోకేశ్ ఫోకస్
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ గురువారం (ఆగస్టు 27) రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకవైపు మంగళగిరిలో రైతులు, ప్రజల సౌకర్యాల కోసం ఆధునిక మోడల్ రైతుబజార్‌కు శంకుస్థాపన చేస్తే, మరోవైపు నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల పరిస్థితిపై సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్‌ఆర్ నిధులు రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో రిటైల్, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ నిర్మితం కానుంది. మొత్తం 71,925 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ మార్కెట్‌లో 102 కూరగాయల స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాలకు 54 స్టాళ్లు, ఇతర వస్తువులకు 60 షాపులు రానున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, 23 కూరగాయల షాపులతో పాటు కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియా, క్యాంటీన్, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రైతులు తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించుకునేలా, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉండేలా మార్కెట్‌ను తీర్చిదిద్దనున్నారు. సరకుల రవాణా వాహనాలతోపాటు టూవీలర్, ఫోర్ వీలర్లకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు.
ఇదే సమయంలో నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి లోకేశ్ సమీక్షించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల పరిస్థితిపై ఆరా తీయగా.. నలుగురు సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని దిల్లీలోని ఏపీ భవన్ అధికారులు లోకేశ్‌కు వివరించారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌నకు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. గల్లంతైన ముగ్గురి ఆచూకీ వీలైనంత త్వరగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని లోకేశ్ ఆదేశించారు.
చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్ చివరిసారిగా కనిపించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కరశాస్త్రితో పాటు మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు. లోకేశ్ ఆదేశాల మేరకు నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులు, మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.