AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం: ములకలచెరువులో ఉత్పత్తి.. ఇబ్రహీంపట్నంలో బాటిల్ ప్యాకింగ్

ఇబ్రహీంపట్నంలో బాటిల్ ప్యాకింగ్

Update: 2025-10-07 06:33 GMT

AP Liquor Scam: అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు ప్రాంతంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం తయారీ దందా లింకులు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. ఈ కేసులో ముఖ్య నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుకు సంబంధించిన రెండు గోడౌన్లలో ఎక్సైజ్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ములకలచెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇక్కడి యూనిట్లలో ప్రాసెస్ చేసి బాటిళ్లలో నింపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, మంజీరా వంటి ప్రసిద్ధ బ్రాండ్ల లేబుల్స్‌తో నకిలీ మద్యాన్ని వేలాది క్వార్టర్ బాటిళ్లలో ప్యాక్ చేస్తున్నారు. ఇవి అసలు బ్రాండ్లకు హుందాగా సరిపోయేలా ఉన్నాయి. మూతలు బిగించే మెషీన్లు, హోలోగ్రామ్ స్టిక్కర్లు, కార్టన్ బాక్సులు కూడా అక్కడే లభ్యమయ్యాయి. ఈ గోడౌన్ల నుంచి మద్యం షాపులు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జనార్దనరావు తన సోదరుడు జగన్మోహనరావు సహాయంతో ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు తేలింది.

పచారీ దుకాణం నుంచి మద్యం వ్యాపారం వరకు..

ఇబ్రహీంపట్నం స్థానికుడైన జనార్దనరావు మొదట్లో పచారీ షాపు నడిపేవాడు. గతంలో ఐపీ కేసులు కూడా పెట్టినట్లు సమాచారం. 2012లో మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇటీవలి వేలంలో తన పేరుపై ఒక బార్‌ను సొంతం చేసుకున్నాడు. అధికారులు అతడి వ్యాపారాలపై విచారణ చేపట్టి, సన్నిహితులను ప్రశ్నించారు. సోదరుడు జగన్మోహనరావు విచారణలో ఇబ్రహీంపట్నంలో గోడౌన్ ఉన్న విషయం బయటపడింది. తనిఖీల్లో భారీ మొత్తంలో క్యాన్లు, నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, హోలోగ్రామ్ స్టిక్కర్లు, ప్యాకింగ్ యూనిట్లు దొరికాయి.

ములకలచెరువులో రెక్టిఫైడ్ స్పిరిట్, మాల్ట్, కారమెల్ కలిపి మద్యాన్ని తయారు చేసి, ఇబ్రహీంపట్నానికి రహస్య మార్గాల్లో తరలించేవారు. దీనికి నమ్మకస్తులైన కూలీలను నియమించుకున్నారు. జగన్మోహనరావు ఈ కార్యకలాపాలను పర్యవేక్షించేవాడు. జనార్దనరావు సెప్టెంబర్ 24న వ్యాపార నిమిత్తం ఆఫ్రికా దేశాలకు వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు.

తెనాలిలో వైకాపా కార్యకర్త ఇంట్లో సోదాలు

ఈ కేసులో ఏ-12 నిందితుడిగా గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన వైకాపా కార్యకర్త కొడాలి శ్రీనివాసరావు ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు రోజులుగా పరారీలో ఉన్న అతడిని పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో వైకాపా పోలింగ్ ఏజెంట్‌గా పనిచేశాడు. ములకలచెరువులోని షెడ్‌ను జనార్దనరావు శ్రీనివాసరావు పేరుపై లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అనారోగ్యంతో విదేశాల్లో ఉన్నాను: జనార్దనరావు

ములకలచెరువు: అనారోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నానని, త్వరలో భారత్‌కు తిరిగి వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తానని ఏ-1 నిందితుడు జనార్దనరావు తెలిపాడు. దక్షిణాఫ్రికా నుంచి సోమవారం ఒక వీడియో సందేశం విడుదల చేశాడు. 'నకిలీ మద్యం తయారీ గురించి సోషల్ మీడియా ద్వారా తెలిసింది. తంబళ్లపల్లెలోని తెదేపా నేతలకు దీనితో సంబంధం లేదు. రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు' అని అతడు పేర్కొన్నాడు.

Tags:    

Similar News