AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం: జగన్ సమీప వ్యక్తికి చెందిన కంపెనీలపై సిట్ దాడులు
జగన్ సమీప వ్యక్తికి చెందిన కంపెనీలపై సిట్ దాడులు
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో (AP Liquor Scam) సిట్ అధికారులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి (Narreddy Sunil Reddy) కంపెనీలపై సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సునీల్ రెడ్డికి చెందిన పది కంపెనీలలో ఐదు కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంలోని ఈ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నడుస్తున్నాయి.
హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3లో స్నేహా హౌస్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో సాగర్ సొసైటీ, కాటేదాన్‌లో రాజేందర్ నగర్, ఖైరతాబాద్‌లో కమలాపురి కాలనీ ఫేజ్-1, విశాఖపట్నంలో వాల్తేర్ రోడ్ వెస్ట్ వింగ్‌లోని కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. సునీల్ రెడ్డి హైదరాబాద్‌లో ఎనిమిది కంపెనీలకు గానూ నాలుగు కార్యాలయాలు, విశాఖపట్నంలో రెండు కంపెనీలకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు.
సునీల్ రెడ్డి నిర్వహిస్తున్న కంపెనీలలో ఆర్ ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్‌ఫ్రా కాన్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్‌ప్రైజెస్, గ్రీన్ కార్ట్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సీస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రెడింగ్ ఉన్నాయి. ఈ కంపెనీలు ప్రైవేట్ లిమిటెడ్, LLP, ఫౌండేషన్ హోదాల్లో నడుస్తున్నాయి. సిట్ అధికారుల సోదాల ద్వారా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది.