AP Parishad Election: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. గురువారం నిర్వహించిన పోలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఓటు వేశారు. శనివారం ఉదయమే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు జడ్పీటీసీ స్థానంలో 142 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా, తెదేపా అభ్యర్థికి 122 ఓట్లు పోలయ్యాయి. అదే జిల్లా కలిగిరి మండలంలో తెదేపా అభ్యర్థి షర్మిలకు 153 ఓట్లు రాగా, వైకాపాకు 24 ఓట్లు మాత్రమే వచ్చాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోనూ పోస్టల్ బ్యాలెట్లలో తెదేపాకు 84, వైకాపాకు 32 ఓట్లు పోలయ్యాయి.


కడప, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, కాకినాడ తదితర జిల్లాల్లోని వివిధ కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు కార్యకలాపాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా మధ్యాహ్నం తర్వాత ఎంపీటీసీ స్థానాల తొలి ఫలితాలు రావడం ప్రారంభం కానుంది.

Tags: