Tirumala Laddu Adulteration Case: లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం.. దర్యాప్తు బదిలీ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు
Tirumala Laddu Adulteration Case: తిరుమల లడ్డూ కల్తీ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గురువారం ఈ అంశంపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మాల్‌గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మచీంద్ర శాంతారాం లంకే ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపిస్తూ, ఈ కేసు విషయంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యానాలు స్వేచ్ఛాయుత విచారణకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు.
“ఈ కేసు రాజకీయాంశంగా మారింది. ఇందులో జంతుకొవ్వు కలవలేదని ఫోరెన్సిక్ నివేదిక చెబుతున్నా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కూడా దీనిపై మాట్లాడారు. దిగువ కోర్టు న్యాయమూర్తి ఈ వ్యాఖ్యల ప్రభావానికి లోను కాకపోయినా ప్రస్తుతం ఉన్న వాతావరణంలో నిష్పాక్షిక విచారణను ఆశించలేం. అందువల్ల దీని విచారణను పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నాం. ఈ అంశంపై నాయకుల ప్రకటనలను కోర్టు పరిశీలించాలి. ఇలాంటి వాతావరణంలో విచారణ కొనసాగితే ఇబ్బంది పడేది నేనే. నాయకుల మధ్య యుద్ధంలో నన్ను ఉపయోగించుకుంటున్నారు. ఇది సీబీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న కేసు. నిందితుల్లో చాలామంది ఉత్తర భారతీయులు. వారికి అక్కడ భాషాపరమైన సమస్యలూ ఉంటాయి” అని ఆయన వాదించారు.
అయితే ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. విచారణ బదిలీకి ప్రాతిపదికేమీ లేదని, అందువల్ల పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రకటించారు. ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా నాయకులందరినీ మాట్లాడకుండా చేశామని, ఏదైనా జరిగితే ఇక్కడికి రావొచ్చని పేర్కొంటూ విచారణ ముగించారు.