Gram Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించి రెండో విడత (Phase-II) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచుల ఎన్నికలకు ఈ నోటిఫికేషన్ జారీ అయింది.

నవంబర్ 18 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 29న పోలింగ్ జరగనుండగా, అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, ఫలితాలు వెల్లడి కానున్నాయి. అక్టోబర్ 14న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 13న తొలి విడత నోటిఫికేషన్ జారీ అయింది. ప్రస్తుతం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ (నవంబర్ 15 నుంచి 17 వరకు) కొనసాగుతోంది.

రెండో విడత పూర్తి షెడ్యూల్

ఫారమ్-1లో ఎన్నికల నోటీసును రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. అదే రోజు వార్డు వారీ ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ (ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు). నవంబర్ 20 (సాయంత్రం 5.00 గంటల వరకు) నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. నవంబర్ 21 (ఉదయం 8.00 గంటల నుంచి) అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ). నవంబర్ 22 (సాయంత్రం 5.00 గంటల వరకు) తిరస్కరించబడిన నామినేషన్లపై ఆర్డీవో వద్ద అప్పీలు చేసుకునే అవకాశం. నవంబర్ 23న అప్పీళ్ల పరిష్కారం. నవంబర్ 24 (మధ్యాహ్నం 3.00 గంటల వరకు) అభ్యర్థిత్వాల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు మధ్యాహ్నం 3.00 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ. నవంబర్ 29 (ఉదయం 7.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు) పోలింగ్.అదే రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

ఉప సర్పంచ్ ఎన్నిక

ఫలితాలు ప్రకటించిన రోజే (నవంబర్ 29న) ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఆ రోజు జరగకపోతే మరుసటి రోజు తప్పనిసరిగా నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అవసరమైన చోట్ల నవంబర్ 30న రీపోలింగ్ జరిగి ఫలితాలు ప్రకటిస్తారు. రీపోలింగ్ జరిగిన పంచాయతీల్లో ఆ ఫలితాలు వెలువడిన తర్వాతే ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. కోర్టు స్టే ఉన్న, పరిపాలనా లేదా న్యాయపరమైన అడ్డంకులు ఉన్న గ్రామ పంచాయతీలకు నోటీసు జారీ చేయవద్దని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎన్నికలు జరిగే జిల్లాలు

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఎంపిక మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. గోదావరి జిల్లాల్లో పోలవరం, తూర్పు గోదావరి, కాకినాడ, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు మండలాల్లో పోరు జరుగనుంది. కోస్తాంధ్రలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నిర్దేశిత మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు మండలాల్లో రెండో విడత పోలింగ్ జరగనుంది.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకోవాలని ఎన్నికల సంఘం ఆశిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags: