Arjun Reddy Case: అర్జున్ రెడ్డి కేసు: వైసీపీకి మరో తీవ్ర దెబ్బ.. జగన్ సమీప బంధువుకి పోలీసుల నోటీసు!

జగన్ సమీప బంధువుకి పోలీసుల నోటీసు!

Update: 2025-12-16 10:48 GMT

Arjun Reddy Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువైన అర్జున్ రెడ్డికి గుడివాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు మరియు వారి కుటుంబ సభ్యుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆరోపణలపై 2025 నవంబర్‌లో అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఈ కేసు నేపథ్యంలో అర్జున్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించినా, ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఆయనపై లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. సోమవారం రాత్రి విదేశాల నుంచి తిరిగి వచ్చిన అర్జున్ రెడ్డిని విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బృందం అర్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు అందజేసింది. అయితే అర్జున్ రెడ్డి ముందుగానే తన న్యాయవాదులను ఎయిర్‌పోర్టుకు పిలిపించుకున్నారు. ఉమ్మడి కడప జిల్లా సహా పలు జిల్లాల్లో అర్జున్ రెడ్డిపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.

ఈ ఘటనతో వైసీపీకి మరో షాక్ తగిలినట్టయింది.

Tags:    

Similar News