ఏపీలో ఇక నుంచి అర్ధరాత్రి వరకు బార్లు
నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్;
- సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త విధానం
- మూడేళ్ల పాటు అమలు చేయనున్న ప్రభుత్వం
- లాటరీ పద్ధతి ద్వారా బార్ల కేటాయింపు
- గీత కార్మికుల కోసం కొత్తగా 84 బార్లకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీ, నిబంధనలను విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. వచ్చే మూడేళ్ల పాటు ఈ పాలసీని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త పాలసీలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో బార్లను వేలం ద్వారా కేటాయించగా, ఇప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీనికోసం 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి అదనంగా, గీత కార్మికుల కోసం మరో 84 బార్లకు తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇక లాటరీ నిర్వహణకు ఒక బార్‌కి కనీసం నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధన పెట్టారు.
బార్ల పనివేళలను ప్రభుత్వం రెండు గంటలు పెంచింది. ఇప్పటివరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు తెరిచి ఉండేవి. ఇకపై ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయి. దరఖాస్తు రుసుముగా నాన్-రిఫండబుల్ ఫీజు రూ. 5 లక్షలు, అదనంగా రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మూడు కేటగిరీలుగా విభజించారు. 50,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో: రూ. 35 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో: రూ. 55 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో: రూ. 75 లక్షలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ప్రతి ఏటా ఈ లైసెన్స్ ఫీజు 10 శాతం పెరుగుతుంది. గీత కార్మికులకు మాత్రం లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 99 క్వార్టర్ మద్యాన్ని బార్లలో విక్రయించరు.
విమానాశ్రయాల్లో బార్లకు అనుమతి
కొత్త పాలసీ ప్రకారం విమానాశ్రయాల్లో కూడా బార్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తిరుపతి విమానాశ్రయాన్ని ఈ నిబంధన నుంచి మినహాయించారు. విమానాశ్రయాల్లో బార్ల ఏర్పాటుపై త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో స్వీకరిస్తారు.