ఎమర్జెన్సీపై బిజెపి రాష్ట్ర వ్యాప్త అవగాహన సదస్సులు
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఆనాటి చేదు ఘటనలను నేటి తరానికి తెలియచేయడానికి బిజెపి నడుంబిగించింది. ఇందు కోసం నేడు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీ చీకటి రోజులపై అవగాహనా సదస్సులు నిర్వహించనుంది. దేశం లో అత్యవసర పరిస్థితి లో కాంగ్రెస్ ఇష్టానుసారం గావ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని... భారతదేశ ప్రజలకు ఎమర్జెన్సీ పేరుతో చీకటి రోజులు చూపించిన ఘటనలు నేటి యువతరానికి తెలియాలని బీజేపీ ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
దేశంలో ఎమర్జన్సీ21నెలలుకొనసాగిందని, ఆనాడు ప్రశ్నించిన ప్రతి ఒక్కరు జైలు పాలయ్యారనే విషయాన్ని ఇప్పటి తరానికి కళ్ళకు కట్టినట్లు ఈ సదస్సుల్లో బీజేపీ వివరించనుంది. బిజెపి రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు లు ప్రారంభిస్తున్నట్లు ఈ కార్యక్రమం ఇంఛార్జి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి వెల్లడించారు. నేడు ఏలూరులో జరిగే అవగాహన సదస్సుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సదస్సు కు రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి భువనేశ్వర్ ఎంపి అపరాజిత సారంగి తిరుపతి సదస్సు కు ముఖ్య అతిథి గా హాజరౌతారని ఆయన తెలిపారు. నేడు పలు ప్రాంతాల్లో మాక్ పార్లమెంటు ల నిర్వహిస్తామని కూడా దయాకరరెడ్డి తెలిపారు. యువకులు, మేధావులు ఈ సదస్సుల్లో పెద్దయెత్తున పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు.