Perni Nani Threatened CI: సీఐని బెదిరించిన పేర్ని నాని సహా 30 మందిపై కేసు
పేర్ని నాని సహా 30 మందిపై కేసు
Perni Nani Threatened CI: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానితో సహా మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్‌పేట సీఐ ఏసుబాబును బెదిరించి, విధులకు అడ్డుపడినట్లు చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్టర్ చేశారు. ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నారు.
ఇటీవల పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అప్పటికే కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసనకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా వాగ్వాదానికి దిగారు. లాఠీలు లాక్కోవడంతో పోలీసులు 400 మందిపై కేసు నమోదు చేసి, 41ఏ నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే, వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి, తమ సూచనలు వచ్చేవరకు ఎవరూ పోలీసుల వద్దకు వెళ్లొద్దని పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం పోలీసులు సుబ్బన్నను అదుపులోకి తీసుకుని మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఈ విషయం తెలిసి పేర్ని నాని పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నేరుగా సీఐ గదిలోకి ప్రవేశించి బెదిరింపులకు పాల్పడ్డారు. పలువురు వైసీపీ నేతలు పోలీసులను అవమానకరంగా మాట్లాడారు. ఇలా చేయడం సరికాదని సీఐ ఏసుబాబు హెచ్చరించడంతో పేర్ని నాని మరింత రెచ్చిపోయి, వేలు చూపిస్తూ 'మా వాళ్ళనే తీసుకొస్తావా' అంటూ బెదిరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.