Case Filed Against Ambati Rambabu: అంబటి రాంబాబుపై కేసు: పోలీసులను బెదిరించి, అనుమతి లేకుండా ర్యాలీ.. వైకాపా నేతలపై చర్యలు

వైకాపా నేతలపై చర్యలు

Update: 2025-11-13 11:46 GMT

Case Filed Against Ambati Rambabu: మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబుతో పాటు ఇతర నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులను బెదిరించారని, వారి విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించి బీఎన్‌ఎస్ 132, 126(2), 351(3), 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, ప్రజలకు అసౌకర్యం కలిగించారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పట్టాభిపురంలో ఉద్రిక్తతలకు దారితీసింది.

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైకాపా నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి అనుమతి లేదని డీఎస్పీ అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు అంబటికి స్పష్టం చేసినా, వారు దాన్ని పట్టించుకోలేదు. కంకరగుంట వంతెన పైకి వెళ్లనివ్వకుండా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. అయినా అంబటి తన అనుచరులతో కలిసి బలవంతంగా ముందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను తోసి, పక్కకు నెట్టేశారు. సీఐ వెంకటేశ్వర్లు, డీఎస్పీ అరవింద్‌లతో వాగ్వాదానికి దిగి, ‘మాకు తెలియదు మరి.. మేము చిన్న పిల్లలం.. మీరు చెప్తే వినాలి’ అంటూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

సీఐని బలవంతంగా తోసేసినప్పుడు ఆయన టోపీ కింద పడిపోయింది. అడ్డుకున్న కానిస్టేబుల్‌పై కూడా దురుసుగా వ్యవహరించారు. గతంలోనూ ఈ సీఐపై అంబటి జులుం ప్రదర్శించారని పోలీసులు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాజనారాయణ వంటి నేతలు పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్‌కు ఆటంకం కలిగించారని, ట్రాఫిక్‌ను దెబ్బతీశారని సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags:    

Similar News