Irrigation Projects : తెలుగు రాష్ట్రాల నీటి వివాదాల పరిష్కారానికి కేంద్ర కమిటీ

జలశక్తి మంత్రి సీఆర్‌పాటిల్‌ తో సమావేశమైన ఏపీ, తెలంగాణ సీయంలు;

Update: 2025-07-17 03:59 GMT

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గోదావరి,కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ నియమించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన ఏపీ సీయం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీయం ఎనుముల రేవంత్‌ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, వివిధ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఉన్న అవరోధాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రం కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. అందులో ప్రధానంగా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాలు అమర్చాలని సీయం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు ఏపీ సీయం చంద్రబాబు అంగీకరించారు. అలాగే గోదావరి నది యాజమాన్యం బోర్డు తెలంగాణ రాష్ట్రలో, కృష్ణా నది యాజమాన్యం బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతు పనుల చేయించడానికి ఈ సమావేశలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంగీకరించింది. ఇరు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదీజలాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినట్లు ముఖ్యమంత్రులిద్దరూ వెల్లడించారు. అయితే అసలు కేంద్ర జలశక్తి శాఖ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి సమావేశం నిర్వహించిందే బనకచర్ల ప్రాజెక్టు అంశం చర్చించడానికి. కానీ ఈ సమావేశంలో అసలు బనకచర్ల ప్రస్తావనే రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పడం విశేషం. అయితే సమావేశానికి ముందు ఇరు రాష్ట్రాలకు ఎజెండా పంపమని కేంద్ర జలశక్తి శాఖ కోరినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ మాత్రం బనకచర్ల ప్రాజెక్టును సింగిల్‌ ఎజెండాగా పంపింది. తెలంగాణ మాత్రం బనకచర్ల ప్రాజెక్టుపై మేము మాట్లాడేది ఏమీ లేదని తమ రాష్ట్రానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి, డిండి, చేవెళ్ళ ప్రాణహిత వంటి ప్రాజెక్టులను తమ ఎంజెండాగా పంపింది.

Tags:    

Similar News