Ex Dy Cm Amzad Basha : సామాజిక పింఛన్లకు చంద్రబాబు కొత్త భాష్యం

పెన్షన్ల కోతపై మండిపడ్డ మాజీ డిప్యూటీ సీయం అంజాద్‌ బాషా;

Update: 2025-08-23 11:52 GMT

సామాజిక పింఛన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త భాష్యం చెపుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్ బాషా అన్నారు. శనివారం కడపలోని ఆయన నివాసంలో అంజాద్‌ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. కనీస మానవత్వం కూడా కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. పెన్షన్‌ వెయ్యిరూపాయలు పెంచి లక్షల మందిని పెన్షనర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని అంజాద్‌ బాషా మండిపడ్డారు. వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 66 లక్షల 34 వేల మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేవాళ్ళమని కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్యను 62.19 లక్షలకు కుదించిందని ఆయన మండిపడ్డారు. దాదాపు నాలుగు లక్షల పెన్షన్లకు చంద్రబాబు సర్కార్‌ కోత పెట్టిందన్నారు. రీ వెరిఫికేషన్ పేరిట దివ్యాంగులకు పెన్షన్స్ కోత పెట్టడం దారుణమన్నారు. అనేక సంవత్సరాలుగా పింఛను తీసుకుంటున్న వాళ్ళను కూడా తొలగించారని చెప్పారు. వంద శాతం వైకల్యం ఉన్నట్లు గత టీడీపీ ప్రభుత్వంలోనే సర్టిఫికెట్లు ఇచ్చారని, అప్పుడున్న వైకల్యం ఇప్పుడు ఎలా తగ్గిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అంజాద్‌ బాషా డిమాండ్‌ చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వైకల్యం సర్టిఫికెట్లు ఇప్పుడు ఫేక్‌ ఎలా అవుతాయని ఆయన నిలదీశారు. పెన్షన్ల విషయంలో స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లు మాట్లాడుతున్న తీరు బాధాకరమని అన్నారు. 12 ఏళ్ళుగా తీసుకుంటున్న పించన్లు కావాలనే కోత పెట్టారని అంజాద్‌ బాషా మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి మనసు, మానవత్వం లేవని అన్నారు.

Tags:    

Similar News