AP Legislative Council: ఏపీ శాసన మండలిలో గందరగోళం.. సీఎంపై వైకాపా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు, మంత్రుల ఆగ్రహం

సీఎంపై వైకాపా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు, మంత్రుల ఆగ్రహం

Update: 2025-09-25 09:33 GMT

AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సూపర్‌ సిక్స్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా సూపర్‌ హిట్‌ అంటూ ప్రజలను మోసం చేస్తోందని వైకాపా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. దీనిపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు హామీల అమలును జీర్ణించుకోలేక కడుపుమంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును "కుప్పం ఎమ్మెల్యే" అని సంబోధించిన రమేశ్‌ యాదవ్‌ క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్‌ చేశారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, వైకాపా సభ్యుడు సీఎంను అగౌరవపరిచేలా "కుప్పం ఎమ్మెల్యే" అని పిలిచారని, రికార్డులను పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం సభా నాయకుడని, ఆ విషయాన్ని వైకాపా సభ్యుడు ఎలా మర్చిపోతారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.

మండలి ఛైర్మన్‌ స్పందన

మండలి ఛైర్మన్‌ మోషేనురాజు, సభలో జరిగిన పరిణామాలు సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. రమేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. సూపర్‌ సిక్స్‌పై చర్చను రేపటికి వాయిదా వేస్తూ, వ్యవసాయం మరియు సూపర్‌ సిక్స్‌ అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.

Tags:    

Similar News