CM Chandrababu: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ‘సంజీవని’ ప్రాజెక్టుకు ఊతం!

‘సంజీవని’ ప్రాజెక్టుకు ఊతం!

Update: 2025-11-21 10:42 GMT

చిత్తూరు జిల్లాలో జనవరి నుంచి అమలు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ.. నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చ


CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో విస్తృత సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ‘సంజీవని’ ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్‌పై లోతైన చర్చ జరిగింది.

సమీక్షలో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవని ప్రాజెక్టును రాబోయే జనవరి నుంచి చిత్తూరు జిల్లా మొత్తం వ్యాప్తి చేయనున్నారు. అనంతరం దశలవారీగా రాష్ట్రమంతటా అమలు చేసేలా వివిధ దశల ప్రణాళికలు రూపొందించారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు.

అదనంగా, తొలి దశలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతిపైనా వివరంగా చర్చించారు. విద్యార్థులు, ప్రజల సామాజిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) తరహాలో ఈ కాలేజీలను నిర్మిస్తోంది. దీంతో బోధనా ఆసుపత్రులు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వైద్య విద్య, ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు అన్ని చర్యలు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News