CM Chandrababu Naidu: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన ఘనవిజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని తలకెక్కించుకుని అహంకారంతో వ్యవహరించకుండా మరింత బాధ్యతగా, జవాబుదారీతనంతో పనిచేయాలని మంత్రులకు సూచించారు. ప్రజలు ఎలాంటి పాలన కావాలనేది స్పష్టంగా తెలియజేశారని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమికి భారీ మెజారిటీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

నాయకుల నిర్ణయాలు, ప్రవర్తనలో లోపాలున్న చోట్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయని సీఎం గుర్తు చేశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని, లోపాల్ని సరిచేసుకోవాలని సూచించారు. 2029 ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ఇప్పటినుంచే కృషి చేయాలని మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన అన్నారు.

సమావేశానికి ముందు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కరచాలనం చేసుకుని పరస్పరం అభినందనలు చెప్పుకున్నారు. మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేశారు. మూడు పార్టీలు సమష్టిగా పనిచేసి ఘనవిజయం సాధించాయని సీఎం అభినందించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసాక జనవరిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు పూర్తిచేసి, తర్వాత పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారిస్తామని చెప్పారు.

విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సు, ఇటీవలి తుపానులు, నిత్యావసరాల ధరల నియంత్రణపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం వల్లే పరిశ్రమలు వస్తున్నాయని సీఎం తెలిపారు. విశాఖలోని సీఐఐ సదస్సులో రూ.11 లక్షల కోట్ల ఒప్పందాలు జరగనున్నట్లు, ఈ రెండున్నరేళ్లలో మొత్తం రూ.31 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షల ఉద్యోగాలు సాధించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఫిబ్రవరి 3న ప్రారంభిస్తామని, ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

యాక్సెస్‌ ఈక్వాలిటీ ఇండెక్స్‌ సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నందుకు గర్విస్తున్నట్లు సీఎం అన్నారు. మంత్రులు జీఎస్‌డీపీపై దృష్టి పెట్టి 15 శాతానికి మించి వృద్ధి సాధించాలని సూచించారు. డ్వాక్రా సంఘాల నిర్వహణలో ఏపీ దేశంలోనే నం.1 స్థానంలో ఉండటం సంతోషదాయకమని పేర్కొన్నారు.

బియ్యం సహా నిత్యావసరాల ధరల పెరుగుదలపై సీఎం సమీక్షించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికోసం నెలకు రూ.100 కోట్ల చొప్పున మూడు నెలల్లో రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాయలసీమలో కరవు పరిస్థితుల వల్ల పశువుల మేతకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇటీవలి రెండు తుపానుల ప్రభావం, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై చర్చ జరిగింది. మురసు తుపానుతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వర్షాల్లో మునిగిపోయిందని, ఎర్రకాలువకు గండ్లుపడి వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయని సీఎం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలన్న ప్రణాళిక ఉండాలని మంత్రి రామానాయుడికి సూచించారు. విద్యుత్‌ లైన్ల పునరుద్ధరణకు సిబ్బందిని పంపిన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు సీఎంలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మంత్రివర్గ సమావేశానికి ముందు తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో మంత్రులతో అల్పాహార విందు సమావేశం జరిగింది. కొన్నిచోట్ల స్థానిక నాయకుల తప్పిదాల వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడ ఎవరు ఎలా పనిచేశారన్న దానిపై రిపోర్టులు పంపిస్తామని, లోపాలు సరిదిద్దుకోవాలని సూచించారు.


Tags: