Visakhapatnam Partnership Summit: విశాఖపట్నంలో నవంబరు 12, 13 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సులో రూ.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 160కి పైగా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. వీటి ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సదస్సుకు సన్నాహకంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు మధ్య దేశవిదేశాల్లో 11 రోడ్‌షోలు, 127 కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు, 15 జి2జి, 17 రౌండ్‌టేబుల్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. విశాఖ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 18 మంది మంత్రులు, 40 మంది అంతర్జాతీయ వక్తలు, 58 దేశాలకు చెందిన 3,800కు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), కేంద్ర సంస్థ డీపీఐఐటీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణకే పరిమితం కాకుండా వాణిజ్యం నుంచి క్వాంటమ్ వరకు వివిధ అంశాలపై మేధోమథనం నిర్వహించి ఆ ఫలితాలను ముందుకు తీసుకెళ్లేలా చర్చలు జరగనున్నాయి.

ముఖ్య అతిథులు

ఈ నెల 12న సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. 13న ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పాల్గొంటారు. సదస్సుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షత వహించనుండగా సీఎం చంద్రబాబు సహ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్ నాయుడు, శర్బానంద సోనోవాల్, చిరాగ్ పాసవాన్ హాజరుకానున్నారు.

కీలక చర్చలు

రెండు రోజుల సదస్సులో ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం, ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణహిత ఇంధనం, వ్యవసాయం, ఆహార భద్రత వంటి ఆరు ప్రధానాంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ఆర్థికవేదిక ఆధ్వర్యంలో భారత ఇంధనరంగం భవిష్యత్తుపై ప్రత్యేక చర్చ, జపాన్, యూఏఈ, రష్యా, ఐరోపా, ఆఫ్రికా దేశాలతో ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతపై ‘ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమిట్ 2026’ కూడా నిర్వహిస్తారు.

ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు

సన్నాహకంగా విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిల్లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సుల్లో రూ.85,561.42 కోట్ల పెట్టుబడులకు 195 సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రూ.5,714.06 కోట్ల విలువైన 68 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

2024 జూన్ నుంచి 2026 అక్టోబరు నాటికి రూ.22.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు 714 ఎంవోయూలు కుదిరాయి. వాటిలో 526 ప్రాజెక్టులకు భూ కేటాయింపు పూర్తయింది. రూ.17.2 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. శంకుస్థాపన, నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న 303 ప్రాజెక్టుల ద్వారా రూ.7.1 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.7 లక్షల మందికి ఉపాధి లభించనుంది.

Tags: