CM Chandrababu: స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్‌తో సమగ్ర కుటుంబ వివరాల సేకరణ: ఆంధ్రలో సుపరిపాలనకు చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రలో సుపరిపాలనకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Update: 2025-11-24 12:11 GMT

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌బీఎంఎస్)పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్‌లో కుటుంబ సమగ్ర సమాచారం ఉంటుందని, రియల్‌టైమ్ గవర్నెన్స్ డేటా లేక్‌తో కుటుంబాలు, వ్యక్తుల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, పౌరసేవల పర్యవేక్షణకు ఈ కార్డ్ ఏకైక వ్యవస్థగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సాధికారతకు ఈ వ్యవస్థను వాడాలని, కుటుంబాన్ని యూనిట్‌గా ఎఫ్‌బీఎంఎస్‌ను అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

జూన్‌లో 1.4 కోట్ల కార్డులు

రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 25 రకాల సేవలు, పీ4 వంటి అంశాలను కార్డులో చేర్చాలని సూచించారు. ఆర్‌టీజీఎస్‌లో ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర శాఖలు వాడుకోవాలని చెప్పారు. స్థిర, డైనమిక్ డేటాను ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని ఆదేశించారు.

ఇదే మా ప్రధాన లక్ష్యం

వాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాలు, సేవల వివరాలన్నీ ఈ కార్డ్ ద్వారా ట్రాక్ చేయాలని సీఎం చెప్పారు. పెన్షన్లు, రేషన్ వంటి పథకాలకు మాత్రమే ఎఫ్‌బీఎంఎస్‌ను పరిమితం చేయొద్దని, పౌరుల అన్ని వివరాలను నమోదు చేసేలా కార్డును రూపొందించాలని ఆదేశించారు. సుపరిపాలనలో భాగంగా అర్హులకు పథకాలు అందించడం, సులభ పౌరసేవలతో పాటు లబ్ధిదారుల ఎంపికలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

డైనమిక్ అప్‌డేట్‌లు తప్పనిసరి

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేలా చూడాలని సూచించారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేసి, ఒకే కార్డ్‌తో అన్ని ప్రభుత్వ సేవలు, పథకాలు అందేలా చూడాలని చెప్పారు. ఆధార్ సహా అన్ని వివరాలు ఈ కార్డ్‌లోనే లభించేలా రూపొందించాలని ఆదేశించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచార క్రోడీకరణ, జూన్‌లోగా కార్డుల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం కీలక దిశా నిర్దేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ గవర్నెన్స్‌ను బలోపేతం చేస్తూ, ప్రజలకు సమగ్ర సేవలు అందించడంలో మైలురాయిగా మారనుంది.

Tags:    

Similar News