Latest Details on Chandrababu's Dubai Visit: సీఎం చంద్రబాబు: ప్రపంచ నాయకులుగా తెలుగువారు | చంద్రబాబు దుబాయ్ పర్యటన తాజా వివరాలు

చంద్రబాబు దుబాయ్ పర్యటన తాజా వివరాలు

Update: 2025-10-25 07:43 GMT

పాతికేళ్ల క్రితమే ఐటీని స్వీకరించిన ఫలితమిది

హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌.. విశాఖకు గూగుల్‌ తీసుకొచ్చా

సింగపూర్, దుబాయ్‌కు ఎయిర్ టాక్సీలు సరఫరా చేస్తాం

తెలుగు డయాస్పోరాతో సీఎం చంద్రబాబు

దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న యువతులు

Latest Details on Chandrababu's Dubai Visit: ‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారు ఉన్నత స్థాయిలో ఉండాలని నేను ఆశించాను. మీ జన్మభూమిని, కర్మభూమిని ఎప్పటికీ మరచిపోకండి. యూఏఈలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారి పట్ల మంచి అభిప్రాయమే కనిపించింది. దుబాయ్‌లోని పలు కార్యాలయాల్లో తెలుగువారు ఉన్నత పదవుల్లో కనిపించారు. వారు గ్లోబల్ లీడర్ల స్థాయికి ఎదిగారు. అందరూ జన్మభూమి రుణాన్ని తీర్చుకోవాలి. 25 ఏళ్ల క్రితం ప్రతి ఇంటికీ ఒక ఐటీ నిపుణుడిని తయారుచేయాలని చెప్పాను. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చినప్పుడు అందులో ఉద్యోగిగా చేరిన సత్య నాదెళ్ల ఇప్పుడు అదే కంపెనీ సీఈఓగా ఉన్నారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒమన్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ, కువైట్ సహా 10 దేశాల నుంచి వేలాది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల్లో గల్ఫ్ దేశాల నుంచి మీరు సొంత ఖర్చులతో కూటమి విజయానికి కృషి చేశారు. అది నా జీవితంలో మరచిపోలేనిది. గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌, ఇప్పుడు విశాఖకు గూగుల్‌ తీసుకొస్తున్నాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే, అమరావతికి క్వాంటమ్ వ్యాలీ వస్తోంది’ అని చెప్పారు. సమావేశం అనంతరం సీఎం వారితో ఫొటోలు దిగారు. ఈ సమావేశంతో సీఎం యూఏఈ పర్యటన ముగిసింది. మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎడారిని స్వర్గంగా మార్చితే.. మనమెలా?

‘దుబాయ్‌ను సమీపంగా పరిశీలించాను. ఎడారిని 15 ఏళ్లలో స్వర్గంగా మార్చారు. అబుధాబి, దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి నాలెడ్జ్ ఎకానమీ వైపు సాగుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధారంగా 1.50 లక్షల గదులు అందుబాటులోకి తెచ్చారు. షాపింగ్ మాల్స్ వచ్చాయి. వర్షాలు లేని ప్రాంతాన్ని ఇలా అభివృద్ధి చేస్తే, అన్ని వనరులున్న ఏపీ ఏ స్థాయిలో ఉండాలి’ అని సీఎం అన్నారు.

దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

ఏదీ అసాధ్యము కాదు నిరూపించాం

‘ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను సృష్టించాలనేది మా లక్ష్యం. ఏదీ అసాధ్యం కాదు. 25 ఏళ్ల క్రితం సెల్‌ఫోన్ గురించి మాట్లాడితే అంతా హేళన చేశారు. ఇప్పుడు సెల్‌ఫోన్ లేకుండా ఎవరూ ఒక్క క్షణం ఉండలేరు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 750 సేవలు అందుబాటులోకి తెచ్చాం’ అని తెలిపారు.

ఏఐతో మార్పులు

‘గూగుల్ విశాఖలో 15 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేస్తోంది. ఐదేళ్లలో అన్ని రంగాల్లో ఏఐ పెనుమార్పులు తెస్తుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించేందుకు తిరుపతి సమీపంలో స్పేస్ సిటీ నిర్మిస్తున్నాం. సింగపూర్, దుబాయ్ త్వరలో ఎయిర్ టాక్సీలు ప్రవేశపెట్టనున్నాయి. వాటిని సరఫరా చేసే స్థాయికి ఏపీ చేరుతుంది’ అని చెప్పారు.

హాజరైన ప్రముఖులు, అభిమానులు

ఎక్కడున్నా కంపెనీ పెట్టవచ్చు

‘ఇక్కడ ఉన్నవారిలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే, ఒకరు పరిశ్రమ పెట్టేలా ఆలోచించండి. సొంత ప్రాంతానికి వచ్చి కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. సాంకేతికతతో ప్రపంచంలో ఎక్కడున్నా కంపెనీ ఏర్పాటు సులభం. వర్చువల్‌గా పని చేయవచ్చు. ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తాం’ అని సీఎం అన్నారు.

మన సంప్రదాయాలు కొనసాగాలి

‘అబుధాబిలో స్వామి నారాయణ్ మందిర్ బ్రహ్మాండంగా నిర్మించారు. నేను అనేక ఆలయాలు చూశాను. ఇక్కడి పాలకులు కూడా మెచ్చుకునేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అందరి సహకారంతో మన సంప్రదాయాలు కొనసాగించాలి’ అని తెలిపారు.

ఆర్‌టీఐహెచ్‌తో దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ భాగస్వామ్యం

కృత్రిమ మేధలో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌తో భాగస్వామ్యంగా పని చేయనున్నది. యూఏఈ పర్యటనలో ఆ దేశ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సీఎం సమావేశమయ్యారు. యూఏఈ-ఏపీ మధ్య వాణిజ్య సంబంధాలు పెంచుకోవడంపై చర్చలు జరిగాయి.

సీఎం మాట్లాడుతూ.. ‘ఆహార భద్రతపై ఏపీతో కలిసి పని చేయడానికి యూఏఈ ఆసక్తి చూపింది. లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాలపై చర్చించాం. స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలకు నిధులు అందించడం ద్వారా ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా మార్చడంలో దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటాం. నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టాం. పాలనలో ఏఐ వినియోగం, పౌర సేవల మెరుగుదలలో సహకరిస్తాం’ అని చెప్పారు. పౌర సేవల్లో సాంకేతికత వినియోగం, పాలనా ఉత్తమ పద్ధతులు ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకోవాలని యూఏఈ కోరింది.

యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ, సీఎం చంద్రబాబు ఆలింగనం

రాష్ట్రంలో రూ.31,165 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు

రాష్ట్రంలో రూ.31,165 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు డీఏ డెక్స్ గ్రూప్, కార్బొనాటిక్ గ్రూప్ ఆసక్తి చూపాయని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. కార్బొనాటిక్ గ్రూప్ అధ్యక్షుడు బ్రెండెన్ ఫిట్జ్‌పాట్రిక్, సీఈఓ ఆనంద్ మలైమేఘం, డీఏ డెక్స్ గ్రూప్ బృందం దుబాయ్‌లో సీఎం చంద్రబాబును కలిసి ప్రతిపాదనలు సమర్పించారు. అంతర్గత జలమార్గాలు, కర్నూలు విమానాశ్రయంలో విమాన మరమ్మతులు, స్టిమ్యులేషన్, పోర్టు, తీరప్రాంత రిసార్ట్‌లు, గిడ్డంగులపై పెట్టుబడులు పెట్టనున్నారు.

ప్రవాసాంధ్రులకు రూ.10 లక్షల బీమా పాలసీ

ప్రవాసాంధ్రుల కోసం బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ‘18-60 ఏళ్ల వయసున్న ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు తక్కువ ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల బీమా అందుతుంది. ప్రవాసాంధ్రుల న్యాయ సమస్యలు పరిష్కరించేందుకు ఎన్నార్టీ సొసైటీ ద్వారా లీగల్ కౌన్సెలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వొకేట్ ఫీజులు అందిస్తాం. ప్రసూతి ఖర్చులకు రూ.35 వేలు, సిజేరియన్‌కు రూ.50 వేలు అందిస్తాం’ అని తెలిపారు.

Tags:    

Similar News