Stree Sakthi : నేడు విజయవాడలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించనున్న సీయం చంద్రబాబు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కానుకకు శ్రీకారం;

Update: 2025-08-15 03:45 GMT

కూటమి ప్రభుత్వం "సూపర్ సిక్స్" హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో శ్రీకారం చుట్టనున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి తెలిపారు. రాష్ట్ర జనాబాలో దాదాపు 50 శాతం మంది మహిళలే ఉన్నారని, వారి అభ్యున్నతిని, సంక్షేమాన్ని కాంక్షిస్తూ మరియు వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కానుకకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 2.50 కోట్ల మంది రాష్ట్ర మహిళలు రాష్ట్రంలోని 74 శాతం బస్సుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కలుగుచున్నదన్నారు. ఇందుకై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1,970 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు పర్చేందుకు డ్రైవర్లు మరియు కండక్టర్లకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఉచిత ప్రయాణం సందర్భంగా ఉండే రద్దీ దృష్ట్యా ప్రయాణీకులతో మర్యాదపూర్వకంగా ఎటువంటి వాగ్వివాదాలకు అవకాశాలు ఇవ్వకుండా నడుచుకోవలసినదిగా సూచించడం జరుగుచున్నదన్నారు. TIMs ద్వారా "జీరో ఫేర్" టికెట్ ను ఏ విధంగా ఇవ్వాలో ట్రైనింగ్ ఇవ్వబడుచున్నదన్నారు. అన్ని TIMs లో సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసి వాటిని ఏ విధంగా ఆపరేట్ చేయాలో తర్పీదు అందజేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు.

ఏపీఆర్టీసీకి మొత్తం 11,449 బస్సులు ఉన్నాయని, ఇందులో 8,458 బస్సులు (74%) - అంటే పల్లెవెలుగు, అల్టా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ. ఎక్స్ ప్రెస్, మరియు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఈ ఉచిత ప్రయాణ పథకం అమలుకానున్నదని మంత్రి తెలిపారు. స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకునే మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అని తెలిపేందుకై ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. 

Tags:    

Similar News