CM Chandrababu to Tour Irrigation Projects: సీఎం చంద్రబాబు జనవరిలో సాగునీటి ప్రాజెక్టుల పర్యటన

సాగునీటి ప్రాజెక్టుల పర్యటన

Update: 2026-01-02 11:53 GMT

పోలవరం, వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలన

నీటి విధానం ముసాయిదా త్వరలో విడుదల

CM Chandrababu to Tour Irrigation Projects: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ జనవరి నెలలోనే ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా సందర్శించి, నిర్మాణ పురోగతిని సమీక్షించనున్నారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలనేది లక్ష్యం. ఈ మేరకు సీఎంఓ నుంచి జలవనరుల శాఖ అధికారులకు సమాచారం అందింది.

పోలవరం పర్యటన తొలివారంలోనే

జనవరి తొలి వారంలోనే ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాలు 2027 జూన్ చివరిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, అప్పటికి ప్రాజెక్టు పూర్తయితే ఖరీఫ్ సీజన్‌కు నీటి విడుదల సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కేంద్రం నిధుల మంజూరుతో పాటు గడువు నిర్దేశించింది.

ప్రస్తుతం కాఫర్‌డ్యాం పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్యాప్-1, గ్యాప్-2 ప్రధాన డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. డయాఫ్రామ్ వాల్‌పై డ్యాం నిర్మాణం, కుడి-ఎడమ కాలువల అనుసంధానం వంటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 2027 ఖరీఫ్‌కు నీటి విడుదల అవకాశాలపై సీఎం దృష్టి పెట్టనున్నారు. ఎడమ కాలువ పనులు జనవరి చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం. పోలవరం వద్ద పర్యాటక అవకాశాలు, నీటి విధానం ముసాయిదా విడుదలపైనా సమీక్ష జరగనుంది.

జలాశయాల్లో 80 శాతానికి మించి నీటి నిల్వలు ఉండటంతో చెరువుల నింపడం, ఖరీఫ్ సాగు ముందుగానే ప్రారంభించడం, భూగర్భజలాల పెంపు, పారిశ్రామిక-తాగు-సాగునీటి ప్రాధాన్యతలపై ముసాయిదా త్వరలో వెలువడనుంది.

వెలిగొండ సందర్శన జనవరి 7 లేదా 9న

వెలిగొండ ప్రాజెక్టును జనవరి 7 లేదా 9న సీఎం సందర్శించనున్నారు. ఈ ఏడాది జులై నాటికి నల్లమల సాగర్‌కు నీళ్లు మళ్లించి, 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం. రెండు టన్నెళ్లలో బెంచింగ్-లైనింగ్ పనులు, హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం, ఫీడర్ కాలువ పెండింగ్ పనులు, పునరావాసం వంటివి పూర్తి చేయాలి. రూ.500 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సీఎం మార్గదర్శనం అందించనున్నారు.

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు 17న పర్యటన

జనవరి 17న ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను సీఎం పరిశీలించనున్నారు. రూ.2,087 కోట్లతో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 2.48 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. నేరడి బ్యారేజి నిర్మాణం కోసం వంశధార ట్రైబ్యునల్ తుది నిర్ణయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News