CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌పై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు హెచ్చరిక
సీఎం చంద్రబాబు హెచ్చరిక
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి రెబల్‌గా పోటీ చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన ఈ హెచ్చరిక జారీ చేశారు.
రెబల్‌గా నామినేషన్లు వేసినవారిని వెనక్కి తీసుకురావాలని, అధికారిక అభ్యర్థుల విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంతోనే అభ్యర్థుల ఎంపిక, ప్రచారం జరగాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. తాత్కాలిక లాభాల కోసం ఎవరినీ నిలబెట్టకుండా, కూటమి కేటాయించిన స్థానాల్లో సమర్థులను గెలిపించుకోవాలని తేల్చి చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. సాధారణ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని కూడా ఆదేశించారు. 11 కార్పొరేషన్లను 11 సామాజిక వర్గాలకు కేటాయించామని, అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
పార్టీ కోసం కష్టపడిన వేలాది కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో పదవులు దక్కే అవకాశం ఉందని, పొత్తులు, సీట్ల పంపకాల వల్ల అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.