Gandikota : ఆగస్టు 1న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీయం

వివరాలు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్;

Update: 2025-07-30 08:43 GMT
  • ఆగస్టు 2, 3 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఏపీటీడీసీ ఎగ్జిబిషన్ ఏర్పాటు
  • నవంబర్ 14, 15వ తేదీన వైజాగ్ లో పార్ట్ నర్ షిప్ సమ్మిట్

కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం క్రింద వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఆగస్టు 1న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం నిడదవోలులో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగులో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం ఆగస్టు 2,3 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తద్వారా అక్కడున్న ఔత్సాహికపెట్టుబడిదారులను,పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అంతేగాక నవంబర్ 14, 15వ తేదీన వైజాగ్ లో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీకి ఛైర్మన్ గా మంత్రి లోకేష్, ఇతర సభ్యుల్లో తాను ఒకడినని తెలిపారు. తద్వారా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను రాష్ట్రానికి ఆహ్వానించనున్నామన్నారు. ఈ నేపథ్యంలో టూరిజం సెక్టార్ లో కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి పార్ట్ నర్ షిప్ సమ్మిట్ ఉపకరిస్తుందన్నారు. ఏపీలో గతంలో సీఎం చంద్రబాబునాయుడు హయాంలో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ ప్రతి ఏటా జరిగేదని గుర్తుచేశారు. వైజాగ్ లో జరిగిన అనేక సమ్మిట్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీఎం చంద్రబాబునాయుడు సహకారహస్తాన్ని అందుకొని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏనాడు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని అవలంభించలేదన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన చేయలేదన్నారు. ఏదో మొక్కుబడిగా ఒకసారి సమావేశం నిర్వహించి మమ అనిపించారని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు మళ్లీ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లపై దృష్టి పెట్టారని ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News