ఏడు అంశాలకు సీఆర్‌డీఏ అథారటీ ఆమోదం
సీయం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ 50 సమావేశం;
అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, తుళ్ళూరు మండలంలో మూడు గ్రామాల్లో కలిపి మొత్తం 20 వేల 494 ఎకరాలను రాజధాని కోసం అదనంగా భూములు సమీకరించడానికి సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఆర్‌డీఏ 50వ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఏడు అంశాలపై సీఆర్‌డీఏ అధారిటీ ఆమోదం తెలిపింది. రాజధాని హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్‌ఎఫ్ పీ పిలిచేందుకు సీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలాగే మందడం, రాయపడి, పిచుకలపాలెం గ్రామాల్లో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా ఆర్ ఎఫ్ పీల ను పిలవాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ళ సమాపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనలకు కూడా అంగీకారం లభించింది. మందడం, తుళ్ళూరు, లింగాయపాలెం గ్రామల్లో 2.5 ఎకరాల చొప్పున నాలుగు ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబీఎస్ ప్రతిపదిక ఆమోదం లభించింది. అలాగే అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక డ్రెడ్జింగ్ కోసం సీఆర్‌డీఏకు అనుమతిచ్చారు. ప్రకాశం బ్యారేజి ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకునేందుకు సీఆర్‌డీఏ అథారిటీ అనుమతి ఇచ్చింది.
అదేవిధంగా పలు సంస్ధలకు భూములు కేటాయించే విషయంలో మంత్రిమండలి ఉప సంఘం తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ ఆమోదించింది. సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు సీఆర్‌డీఏ ఆమోదం లభించింది. రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటు కోసం స్థలం కేటాయించేందుకూ అథారిటీ ఆమోదం ఇచ్చింది. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.