Nara Lokesh : దుగరాజపట్నం పోర్టుతోపాటు షిప్ బిల్డింగ్ యూనిట్ అభివృద్ధి చేయండి
కేంద్ర ఓడరేవులు, జలరవాణాశాఖల మంత్రి సర్బానందతో నారా లోకేష్ భేటీ;
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన మారిటైమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ఆధారిత అభివృద్ధి, జలరవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్రానికి విజ్జప్తి చేశారు. కేంద్ర షిప్పింగ్, ఓడరేవులు, జలరవాణా శాఖల మంత్రి సర్బానంద సోనవాల్ తో మంత్రి నారా లోకేష్ నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద హామీ ఇచ్చిన దుగ్గిరాజపట్నం ఓడరేవును వేగవంతం చేయండి. దుగరాజపట్నం నౌకానిర్మాణం, ఓడరేవు క్లస్టర్ అభివృద్ధి కోసం గుర్తించారు. అక్కడ ప్రధాన ఓడరేవుతోపాటు 2వేల ఎకరాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడితో నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. పోర్టు అనుబంధరంగాల్లో రూ.26వేల కోట్ల పెట్టుబడులు, 5వేల ప్రత్యక్ష, 30వేల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. దీనిద్వారా నెల్లూరు జల్లా ఆర్థివృద్ధిని పెంచుతుంది. దుగరాజపట్నం పోర్టుకు రాష్ట్ర ఈక్విటీగా భూమిని ఇప్పటికే సేకరించి ఇచ్చాం, ఎస్ పివి మోడల్ లో ప్రపంచస్థాయి భాగస్వాములను ఆకర్షించి పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించాలన్నది ఎపి ప్రభుత్వ లక్ష్యం.
సాగర్ మాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రూ.1.14లక్షల కోట్ల విలువైన 110 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ యాంకరేజి పోర్టుల్లో వార్ఫ్ లు, స్లిప్ వేల అప్ గ్రేడ్, జీవవైవిధ్యం కోసం రూ.200 కోట్లు మంజూరు చేయండి. గోదావరి – కృష్ణానదులపై కొత్త జలరవాణా మార్గాలు, కార్గో టెర్మినల్స్, ఫ్లోటింగ్ జెట్టీల అభివృద్ధికి రూ.127.5 కోట్లు మంజూరు చేయండి. పోర్టుల్లో రవాణా కార్యకలాపాల అభివృద్ధికి ఆయా పోర్టులకు అనుసంధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
రివర్ టూరిజంను ప్రోత్సహించడంలో భాగంగా అమరావతి-విజయవాడ స్ట్రెచ్ తో సహా పట్టణ జలమార్గాలను అభివృద్ధి చేయాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. పిపిపి మోడల్ లో చేపట్టే ఈ ప్రాజెక్టుల వల్ల రోడ్ల రద్దీని తగ్గించడమేగాక సరుకును జలమార్గాలకు మోడల్ షిఫ్ట్ ను సులభతరం చేస్తాయి. ఎపిలోని తీరప్రాంతంలో పోర్టు ఆధారిత అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, గ్లోబల్ కాంపిటీటివ్ నెస్ పై దృష్టిసారించాం, ఎపిలో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే ఈ ప్రాజెక్టులకు కేంద్రం సహాయం అందించడంతోపాటు అనుమతలు మంజూరు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.