Pawan Kalyan: ధీరజ్ బొమ్మదేవర చరిత్రాత్మక బంగారం.. పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు
అభినందనలు
Pawan Kalyan: మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో జపాన్‌కు చెందిన జున్యా నకానిషితో జరిగిన ఉత్కంఠభరితమైన షూట్-ఆఫ్‌లో అద్భుతమైన సంయమనం, కచ్చితత్వం, పట్టుదలతో ధీరజ్ స్వర్ణం సాధించారు. దీంతో ప్రపంచ కప్ ఫైనల్‌లో స్వర్ణం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ పురుష రికర్వ్ ఆర్చర్‌గా ఆయన నిలిచారు. ఈ విజయం భారత ఆర్చరీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.
విజయవాడకు చెందిన ధీరజ్ చిన్న వయసులోనే ఆర్చరీ ప్రయాణం ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ శిఖరాగ్రానికి చేరుకున్నారని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా (ఎక్స్)లో పోస్టు చేస్తూ ప్రశంసించారు. “అతని ప్రయాణం, అంకితభావం ప్రత్యేకంగా స్ఫూర్తిదాయకం. ఇది మన క్రీడాకారుల ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనం. బొమ్మదేవర భారత్‌కు గర్వకారణం. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు” అని ఆయన అన్నారు.
ఇదే సందర్భంగా డీపీ వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు కూడా పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. నైపుణ్యం, సంయమనం, పట్టుదలతో సాధించిన ఈ విజయం భారత క్రికెట్‌కు మరో గర్వకారణమని, భారత మహిళలకు అద్భుతమైన ఘనత అని ఆయన పేర్కొన్నారు.
ధీరజ్ బొమ్మదేవర విజయం రాష్ట్రం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. యువ క్రీడాకారులకు ఇది పెద్ద ప్రేరణగా నిలుస్తుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.