Home Minister: గణేశ్ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు చెదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈరోజు (శనివారం) సచివాలయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో హోంమంత్రి అనిత వివిధ అంశాలపై ఎస్పీలతో విస్తృతంగా చర్చించారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు జారీ చేసే విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలు, ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఏకదంతుడి మండపాలు, ఊరేగింపులకు సంబంధించిన నిబంధనలపై కూడా ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు.

శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నిన్న జరిగిన శాంతిభద్రతల సమీక్షలో చర్చించిన అంశాలను కూడా ఎస్పీలకు వివరించారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు.

హోంమంత్రి అనిత ఈ సమావేశం ద్వారా గణేశ్ ఉత్సవాలు సాఫీగా, శాంతియుతంగా జరగాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరించారు.

Tags: