Ysrcp Mp : మల్లికార్జున్ ఖర్గేను కలవడంపై వక్రీకరణలు తగవు
మీడియా సంస్థల్లో రాజకీయ ఊహాగానాలను ఖండించిన ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి;
- మా అధినేత వైయస్ జగన్‌పై పూర్తి విశ్వాసంతో ఎంపీలు ఉన్నారు
- ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పార్టీ అధినేత నిర్ణయం మేరకే నడుచుకుంటాం
- రాజకీయాల్లో ఉన్నంత వరకు వైయస్ జగన్‌తోనే నా పయనం
- కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మా పోరాటం కొనసాగుతుంది
- ఎంపీ మేడా రఘునాథరెడ్డి స్పష్టీకరణ
ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గేతో గత 35 సంవత్సరాలుగా తనకు పరిచయం ఉందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ఆయనతో పరిచయం ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా ఆయనను కలవడంపై కొన్ని మీడియా సంస్థలు రాజకీయ వక్రీకరణలను చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మీడియాకు విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ... వ్యక్తిగత సంబంధాలను కూడా రాజకీయ కోణంలో చూస్తూ, అసంబద్ద కథనాలను ప్రసారం చేయడం తగదని హితవు పలికారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంటే తన పయనం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధినేతపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అలాగే వైయస్ జగన్ సైతం తన పట్ల అదే విశ్వసనీయతతో ఉన్నారని అన్నారు. పార్టీలోని మొత్తం ఎంపీలు వైయస్ జగన్ వెంటే నడుస్తున్నారని, రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికలో సైతం పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే అందరికీ శిరోధార్యమని, దీనిలో మరో ఆలోచనకు తావులేదని ఉద్ఘాటించారు. వైయస్ జగన్ ను మరోసారి సీఎంగా చేసుకోవాలనే కృతనిశ్చయంతో పార్టీ ఎంపీలు పనిచేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ విధానాలపై మా పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. మల్లికార్జున్ ఖర్గేను కలిసిన తరువాత తనపై వస్తున్న ఊహాత్మక కథనాల నేపథ్యంలో స్పష్టత ఇచ్చేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు.