CM Chandrababu: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తో డబుల్ డిజిట్ వృద్ధి లక్ష్యం: సీఎం చంద్రబాబు

డబుల్ డిజిట్ వృద్ధి లక్ష్యం: సీఎం చంద్రబాబు

Update: 2025-09-15 07:49 GMT

 CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, జిల్లా రూపురేఖలను మార్చే అవకాశం కలెక్టర్లకు ఉందని అన్నారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లకు అభినందనలు తెలిపిన ఆయన, పాత కలెక్టర్లు తమ పనితీరును నిరూపించుకోవాలని సూచించారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “పేదరిక నిర్మూలన మన ప్రధాన లక్ష్యం. గతంలో హార్డ్‌వర్క్‌ సరిపోయేది, ఇప్పుడు స్మార్ట్ వర్క్ అవసరం. ఎకో సిస్టమ్‌ను సృష్టించాలి. భారత్‌ను అగ్రస్థానంలో నిలపాలన్నది మన లక్ష్యం. 1991కి ముందు ఆర్థిక వృద్ధి కేవలం 2-3 శాతం మాత్రమే ఉండేది. సంస్కరణలపై అవహేళన చేసిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మనుగడ కోల్పోయాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 11వ స్థానం నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది.”

“కేంద్రం వికసిత్ భారత్-2047 లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మనం స్వర్ణాంధ్రప్రదేశ్-2047ను రూపొందించాం. ఇది అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా ఉండాలి. తెలుగువారు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలన్నది నా ఆకాంక్ష. సామాజిక న్యాయంతో పాటు సమర్థతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించడమే లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్ర వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంది, దీన్ని 15 శాతానికి పెంచాలి. 2029 నాటికి రూ.29 లక్షల కోట్ల జీఎస్డీపీ, రూ.4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు పీ4 విధానాన్ని తీసుకొచ్చాం. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేయడం వారి బాధ్యత” అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News