Driver Rayudu Case: డ్రైవర్ రాయుడు కేసు: నా పై కుట్రలు... వినుత కోట భావోద్వేగ స్పందన
వినుత కోట భావోద్వేగ స్పందన
Driver Rayudu Case: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి వినుత కోట ఓ వీడియో విడుదల చేశారు. తన మనసు నిండా పుట్టేడు బాధతో ఈ వీడియో విడుదల చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి వినుత కోట ఇవాళ సోమవారం ఓ భావోద్వేగ స్పందనలో వీడియో విడుదల చేశారు. తన మనసులో పేరుకుపోయిన బాధలతోనే ఈ వీడియో తెలిపారు. తన డ్రైవర్ రాయుడిని తాను హత్య చేయలేదని, అయినప్పటికీ ఈ కేసులో జైలు శిక్షను అనుభవించానని తెలిపారు. ఈ సంఘటనలు తనకు బాధ కలిగించకపోయినా, తానే చంపానని వ్యాప్తి చెందుతున్న పుకార్లు తీవ్రంగా బాధించాయని వినుత కోట చెప్పుకొచ్చారు.
లక్షల రూపాయల జీతాన్ని వదులుకుని సేవా భావంతోనే రాజకీయాల్లోకి ప్రవేశించానని స్పష్టం చేశారు. హత్యలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని, అలాంటి మనస్తత్వం తనది కాదని బలంగా పేర్కొన్నారు. ఈ కేసులో తనకు ఎటువంటి పాత్ర లేదని కోర్టులో రుజువు చేసుకుని, క్లీన్ చిట్ పొంది బయటకు వస్తానని ధైర్యంగా ప్రకటించారు.
డ్రైవర్ రాయుడు హత్య కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, ఇంతకంటే మరిన్ని వివరాలు చెప్పలేనని తెలిపారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలవడానికి ప్రయత్నించానని గుర్తు చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్నానని చెప్పుకున్నారు. తనపై జరిగిన కుట్రలకు సంబంధించి పూర్తి ఆధారాలతో కూడిన మరో వీడియోను త్వరలో ప్రజల ముందుంచుతానని ప్రకటించారు.