Minister Nara Lokesh: విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ‘యంగ్ ఆంధ్ర థ్రైవింగ్ ఆంధ్ర’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్‌కు అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆరోగ్యం, రాజకీయాలు, యువతకు అవకాశాలు, పరిశ్రమలు, కుటుంబ విషయాలపై ఇద్దరూ చర్చించారు.

లోకేశ్ మాట్లాడుతూ యువతకు కెరీర్‌తో పాటు కుటుంబం కూడా ముఖ్యమని అన్నారు. తండ్రిని అరెస్టు చేసినప్పుడు కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమో అర్థమైందని, కుటుంబంలో బాధ్యతలు భార్యాభర్తలిద్దరివీనని చెప్పారు. అన్ని పనులూ ఇద్దరూ కలిసి పంచుకోవాలని, తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి వల్లే తాను ఈ రోజు ఇలా ఉన్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిత్యం రాత్రి 11 గంటల వరకు పని చేయడం పనిపై ఆయనకున్న అభిరుచి అని అన్నారు.

పిల్లలకు తండ్రి డైపర్ వేస్తే, అన్నం తినిపిస్తే మెచ్చుకుంటారు, అదే తల్లి చేస్తే బాధ్యత అంటారని, ఈ ధోరణి పోవాలని లోకేశ్ చెప్పారు. పని పంచుకున్నప్పుడే మహిళలు మరింతగా ఉద్యోగాల్లోకి రాగలుగుతారని అన్నారు. పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనుల చిత్రాలను మార్చి పురుషులు, మహిళలు సగం సగం ఉండేలా చేశామని వెల్లడించారు.

ఉపాసన మాట్లాడుతూ మహిళలు భర్తల కన్నా ఎక్కువ సంపాదించినా ఇంట్లో చెప్పరని, భయపడతారని, అలా కాకుండా గౌరవించాలని అన్నారు. పురుషుడు భార్య సంపాదనను, విజయాలను గౌరవించడం ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరూ సమాన బాధ్యతలు పంచుకోవాలని సూచించారు.

కృత్రిమ మేధ గురించి అడగగా లోకేశ్ మన విమర్శనాత్మక విశ్లేషణ సామర్థ్యాన్ని అది భర్తీ చేయలేదని, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని, కొత్త సాంకేతికతను మనమంతా స్వాగతించాలని అన్నారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోయినా సమయం దొరికితే కుటుంబంతోనే ఉంటానని చెప్పారు.

తాత నుంచి క్రమశిక్షణ, తెల్లవారుజామున నిద్ర లేవడం, ఏకాగ్రత, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నేర్చుకున్నానని లోకేశ్ అన్నారు. ఏపీకి 100 యూనికార్న్‌ల కన్నా కోటీ 30 లక్షల మంది పారిశ్రామికవేత్తలే ముఖ్యమని, వేగమే రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఉంచుతుందని పేర్కొన్నారు. కుటుంబాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని స్పష్టం చేశారు.

Tags: