Nara Lokesh: విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టులకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను స్వయంగా పరిశీలించి పెట్టుబడి పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. పర్యాటక రంగంలో కూడా అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు.


‘‘రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాను. ఈ సదస్సును రూ.12 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో నిర్వహిస్తున్నాం. దీంతో 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నాం’’ అని లోకేశ్ వివరించారు.


జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ, విజన్ కోసం సీఎం చంద్రబాబు ఎంతవరకైనా కష్టపడతారని, ఆయన ఒక విజన్‌కు రూపకల్పన చేస్తే పట్టు విడవకుండా కృషి చేస్తారని కొనియాడారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు ముందుంటారని, అమరావతిపై దృష్టి సారించారని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ నాయకత్వంలో పెట్టుబడులకు మార్గం సుగమమైందని అన్నారు.

ఈ సదస్సు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టే కీలక వేదికగా మారింది.

Tags: