AP Deputy Chief Minister Pawan Kalyan: ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు నేరుగా లాభం చేకూర్చేలా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అధికారులకు సూచించారు. ఏ కార్యక్రమమైనా అమలులో ఎటువంటి వెనుకబాటు లేకుండా చూడాలని, పూర్తి పారదర్శకతతో ముందుకు సాగాలని ఆయన ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అందరూ ముందుకు వెళ్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొన్ని పనుల పూర్తిలో ఉదాసీనత, మినహాయింపులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 'మేము కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని ఉండే వారు కాదు. అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పినా, కొన్ని అంశాల్లో లోటుపాట్లు ఉన్నాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు చివరి స్థాయి ఉద్యోగి వరకు జవాబుదారీతనాన్ని నిర్దేశించి, ఈ లోపాలను సరిచేయాలి' అని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ తక్కువ వనరులతోనే కీలక అభివృద్ధి పనులను చేపట్టామని పవన్ తెలిపారు. ప్రధాని మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో ముందుకు సాగుతున్నామని, ఈ కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు కనిపించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించామని ఆయన వివరించారు. పల్లె పండుగ 1.0 కింద రూ.2,500 కోట్లు, 2.0 కింద రూ.5,700 కోట్లు వెచ్చించామని, అడవి తల్లి బాట పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాల మెరుగుదలకు రూ.1,005 కోట్లు కేటాయించామని తెలిపారు. సాస్కీ నిధులతో రూ.2,123 కోట్ల పనులు చేపట్టామని, మొత్తంగా రూ.11,328 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

జలజీవన్ మిషన్ కింద రూ.28 వేల కోట్ల పనులకు అనుమతులు వచ్చినా, అందులో రూ.10 వేల కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని, అటవీశాఖ పరిధిలో రూ.200 కోట్లతో నగర వనాలు ఏర్పాటు చేస్తున్నామని పవన్ వెల్లడించారు. చేపట్టిన ప్రతి పనినీ నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని, ప్రభుత్వ నిర్ణయాల అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతలు మరింత ఎక్కువని ఆయన హెచ్చరించారు. ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులకు సరైన దిశానిర్దేశం చేసి, పనులు సకాలంలో ముగించేలా చూడాలని సూచించారు.

Tags: