Former MP YS Vivekananda Reddy: పులివెందుల: వివేకా కుటుంబానికి వైకాపా కక్ష పన్నాగాలు

వైకాపా కక్ష పన్నాగాలు

Update: 2025-12-22 05:57 GMT

Former MP YS Vivekananda Reddy: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న ఆయన భార్య వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి కుటుంబానికి మరో దెబ్బ తగిలింది. పులివెందుల పట్టణ సమీపంలో సౌభాగ్యమ్మ పేరిట ఉన్న సుమారు రూ.4 కోట్ల విలువ చేసే 7.03 ఎకరాల భూమిని అక్రమంగా ఇతరుల పేర్లకు బదిలీ చేశారు. ఈ అరాచకం వైకాపా ప్రభుత్వ హయాంలో కక్షతో జరిగినట్టు విచారణలో వెల్లడైంది.

2006 ఫిబ్రవరి 17న పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నంబర్లు 1577/2006, 1579/2006 కింద కొనుగోలు చేసిన ఈ భూములు కె.వెలమవారిపల్లె గ్రామంలోని సర్వే నంబర్లు 351/ఎ (2.91 ఎకరాలు), 352 (4.05 ఎకరాలు), 353/1 (0.04 సెంట్లు), 354 (0.03 సెంట్లు)లో ఉన్నాయి. ఇటీవల మ్యుటేషన్ కోసం ప్రయత్నించగా ఈ భూములు సౌభాగ్యమ్మ పేరిట లేవని తేలింది. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో 2022 వరకు ఆమె పేరుతోనే ఉన్నాయి. కానీ తర్వాత అక్రమ మార్పులు జరిగాయి.

ఒక భాగం భూమి సౌభాగ్యమ్మ పేరుతో పోలిక ఉన్న సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి (భర్త గంగిరెడ్డి) పేరిటకు మార్చారు. మిగతా 4.12 ఎకరాలు (సర్వే నంబర్లు 352, 353/1, 354) రెగ్యులర్ ఖాతా నంబరు 763 నుంచి నోషనల్ ఖాతా నంబరు 300004కు బదిలీ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న సౌభాగ్యమ్మ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. పులివెందుల ఆర్‌డీవో చిన్నయ్య విచారణలో ఈ మార్పులు అప్పటి తహసీల్దార్ కె.మాధవకృష్ణారెడ్డి పాల్పడిన అక్రమాలని నిర్ధారించారు. మండల సర్వేయర్ నిర్వహించిన సర్వేలోనూ భూములు సౌభాగ్యమ్మదేనని నిరూపితమైంది.

2020 నుంచి 2024 వరకు పులివెందుల తహసీల్దార్‌గా పనిచేసిన మాధవకృష్ణారెడ్డి ప్రస్తుతం కలెక్టరేట్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నారు. భూముల నిషేధిత జాబితా వంటి కీలక విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.

వివేకా కుటుంబంపై వైకాపా హయాంలో జరిగిన ఈ కక్ష్య చర్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Tags:    

Similar News