ఆగస్టు15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు
చంద్రబాబు అధ్యక్షత భేటీ ఆయిన మంత్రివర్గం నిర్ణయం;
ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 12 అంశాలపై చర్చించిన మంత్రిమండలి వాటికి ఆమోదం తెలిపింది. వాటిలో ప్రధానంగా ఆగస్టు 25వ తేదీ నుంచి రాష్ట్రం మొత్తం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి క్యాబినేట్ అంగీకరించింది. అలాగే నూతన బార్ పాలసీకి కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఇక నాయి బ్రహ్మణులకు 150 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి క్యాబినేట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 22 ఏపీటీడీసీ హాస్టళ్ళను ప్రవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు మంత్రవర్గం ఆమోదం తెలిపింది. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూ బదలాయింపును రద్దు చేయాలని చంద్రబాబు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోదం లభించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారంటీ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రూ.700 కోట్లు రుణం తీసుకునేందుకు ఏపీఐఐసీకి మంత్రిమండలి అనుమతి ఇచ్చింది. వీటితో పాటు ఐదు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే మావోయిస్ట్ పార్టీ, ఆర్డీఎప్ పార్టీ కార్యకలాపాలపై మరో ఏడాది నిషేధం పొడగిస్తూ బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.