Minister Narayana in CRDA Meeting: ప్రభుత్వంపై విశ్వాసంతో భూములు ఇచ్చిన రైతులకు పూర్తి న్యాయం.. సీఆర్డీఏ సమావేశంలో మంత్రి నారాయణ స్పష్టత

సీఆర్డీఏ సమావేశంలో మంత్రి నారాయణ స్పష్టత

Update: 2025-11-22 11:03 GMT

Minister Narayana in CRDA Meeting: రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కీలక సమావేశం నిర్వహించింది. రాజధానిలోని సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ముఖ్య అధికారులతో కమిటీ సమావేశమైంది. దీనికి రైతు జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. రైతులు లేవనెత్తిన అంశాలపై పరిష్కారం దిశగా కమిటీ సమాలోచనలు చేసింది.

ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని పేర్కొన్నారు. గతంలో జగన్ ప్రభుత్వ తీరు వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పెమ్మసాని అన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాలని తమ కమిటీకి సీఎం సూచించారని తెలిపారు.

‘‘రాజధానిలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. జరీబు భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం చూపిస్తాం. సీఆర్డీఏ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరీబు భూములను గుర్తిస్తారు. గ్రామ కంఠాల సమస్య కూడా పరిష్కరిస్తాం. లంక భూముల సమస్యను జగన్‌ జఠిలం చేశారు. దీనిపై వైకాపా నేతలు కోర్టులో కేసులు వేశారు. అసైన్డ్‌ భూములను కొందరు అమ్ముకుంటే జగన్‌ ప్రభుత్వం తప్పుబట్టి ఆపేసింది. మిగతా ప్రాంతాల్లో అసైన్డ్‌ చట్టానికి, రాజధానిలో అసైన్డ్‌ భూములకు వ్యత్యాసం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మూడు నెలల సమయం పడుతుంది. 90 శాతం రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. రాబోయే 15 ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం మౌలిక వసతులు కల్పిస్తాం. 20 రోజుల్లో డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నాం. వచ్చే జూన్‌ నాటికి రాజధాని గ్రామాల్లో తాగునీరు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేస్తాం. మరో వారం తర్వాత త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది’’ అని పెమ్మసాని అన్నారు.

Tags:    

Similar News