Botcha Satyanarayana : రాష్ట్రంలో పాలన గాడితప్పింది

కూటమి సర్కర్‌పై బొత్స సత్యనారాయణ ధ్వజం;

Update: 2025-08-21 07:17 GMT
  • కూటమి ప్రభుత్వంపై ఏ వర్గం సంతృప్తితో లేదు
  • ఎన్నికల హామీల అమలులో పూర్తిగా వైఫల్యం
  • మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగిపోయారు
  • మహిళలకు రక్షణ లేని పరిస్థితి

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదే వైయస్ఆర్‌సీపీ విధానమని, స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు త్వరలోనే ఉద్యమించనున్నట్లు శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 16 సార్లు ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై ఎందుకు కేంద్రాన్ని ఒప్పించలేకపోయారని బొత్స ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌లో ఏకంగా 32 డిపార్ట్‌మెంట్లు ప్రైవేటీకరిస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉండటం దారణమని మండిపడ్డారు. కలిసి వచ్చే వారందరినీ సమన్వయం చేసుకుంటూ, విశాఖ ఉక్కు కోసం పోరాటానికి వైయస్ఆర్‌సీపీ సిద్దంగా ఉందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో 32 డిపార్ట్‌మెంట్‌లను ప్రైవేటీకరిస్తుంటే, దానిపై కూటమి ప్రభుత్వం ఎందుకు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా పైగా వైయస్ఆర్‌సీపీపై బుదరచల్లుతున్నారని బొత్స మండిపడ్డారు. మేం విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎటువంటి ఉద్యమానికైనా సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇది మా పార్టీ విధానం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు వైయస్ జగన్ దీనినే చాలా స్పష్టంగా చెప్పారు. కూటమి అభ్యర్ధులను గెలిపిస్తే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని పదేపదే చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులు ఎం మాట్లాడారు? స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంటూ మాయమాటలు చెప్పారు. రూ.14వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పుడే మోసం జరుగుతోందని మేం చాలా స్పష్టంగా చెప్పాం. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించము అని ప్రకటించాలని డిమాండ్ చేశాం. రెండు సార్లు విశాఖకు ప్రధాని వచ్చినా కూడా ఎందుకు సీఎం చంద్రబాబు ఆయనతో ఈ మేరకు ప్రకటన చేయించలేదు? సీఎం అయిన తరువాత చంద్రబాబు దాదాపు పదహారు సార్లు ఢిల్లీకి వెళ్ళారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రంతో ఏం మాట్లాడారు? ప్రైవేటుపరంపై వెనక్కి వెళ్ళేలా ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మాపైన నిందలు వేస్తున్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనేదే మా స్టాండ్. దీనిపై త్వరలోనే ఎలా ఉద్యమాన్ని ప్రారంభిస్తామో ప్రకటిస్తాం. కలిసి వచ్చే అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెడతామని బొత్స సత్యనారాయణ చెప్పారు.

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వంపై సంతృప్తితో లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బొత్స విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అవుతున్నా, భర్త లేని వితంతువులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం లేదు. ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఎనిమిది వారాలుగా వేతనాలు కూడా చెల్లించకుండా బకాయిపెట్టారు. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ పేరుతో పెద్ద ఎత్తున పెన్షన్లలో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్న తప్పులపై చర్యలు తీసుకోమని బొత్స డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా మంత్రులు, ఎమ్మెల్యేలపైన ఆరోపణలు, మహిళలపై దౌర్జన్యాలు, బాలికలపై దాడులు, విశాఖలో డగ్స్ మాఫియా. శాంతిభద్రతలు ఎక్కడా కనిపించడం లేదు. అయిదేళ్ళ వైయస్ఆర్‌సీపీ పాలన, ఈ పద్నాలుగు నెలల కూటమి పాలనలో జరిగిన నేరాలను బయటపెట్టి, చర్చకు వస్తారా? ఎవరి హయాంలో దారుణాలు జరుగుతున్నాయో ప్రజలకు చూపించగలరా? ప్రభుత్వ శాఖలపై పాలకులకు పట్టు లేకుండా పోయింది. పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాలికి వదిలేశారు. ఇదేనా పరిపాలనా? దీనిని మంచి పాలన అని చెప్పుకుంటున్నారు అని బొత్స ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News