IPS ABV : ఏబీవెంకటేశ్వరరావుపై కేసులు ఉపసంహరించుకున్న ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ విజయానంద్;
గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవెంకటేశ్వరరావుపై పెట్టిన క్రిమినల్ కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వుల జారీ చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం బాస్ గా పని చేసిన ఏబీవెంకటేశ్వరరావు అవినీతి, క్రిమినల్ ఆరోపణలపై సెక్షన్ 120-బి, 420, 409, 511, రెడ్ విత్ 13(1)(డి), అవినీతి నిరోధక చట్టం 15 సెక్షన్లతో అభియోగాలు మోపి గత ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈ కేసుల పై ఏసీబీ ప్రత్యక న్యాయస్ధానంలో ఛార్జీషీట్లు కూడా అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసింది. అయితే తనపై పెట్టిన కేసులన్నీ కొట్టివేయాలని ఏబీవెంకటేశ్వరరావు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఏబీవీ పిటీషన్ పరిశీలించిన హైకోర్టు ఆయనపై పెట్టిన అవినీతి కేసులను కొట్టి వేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాది తరువాత ఏబీవెంకటేశ్వరరావు పై గత ప్రభుత్వం పెట్టిన కేసులను పరిశీలించి వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ఏబీవీపై కేసులు ఉపసంహరించుకుంటూ జీఓ విడుదల చేశారు.