Atchannaidu and Botsa Clash: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సోమవారం డీఎస్సీ-2025 నియామకాల అంశంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో సభ గందరగోళంగా మారింది. ఛైర్మన్ మోషేనురాజు అధ్యక్షతన మండలి సమావేశం ప్రారంభం కాగానే వైకాపా ఎమ్మెల్సీలు డీఎస్సీపై చర్చకు వాయిదా తీర్మానం సమర్పించారు. అయితే ఛైర్మన్ దాన్ని తిరస్కరించారు.

ఆ వెంటనే వైకాపా సభ్యులు మూకుమ్మడిగా ఛైర్మన్ పోడియం చుట్టూ చేరి ‘మెగా డీఎస్సీ, దగా డీఎస్సీ’ అంటూ నినాదాలు చేశారు. కొందరు పోడియంపైకి ఎక్కి ఛైర్మన్ బల్ల చరుస్తూ గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైనా సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు వినిపించలేదు. ఉదయం 10.15 గంటలకు సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12.05 గంటలకు తిరిగి ప్రారంభమైనా పరిస్థితి మారకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. చివరకు 1.36 గంటలకు సభ సమావేశమై మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు భావించి మంగళవారానికి వాయిదా వేశారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. “వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగ యువతను మోసగించింది. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2019లో హామీ ఇచ్చి అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంది. అలాంటి గొడ్డలి పార్టీకి డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు లేదు” అని అచ్చెన్నాయుడు విమర్శించారు. “2019-24 మధ్య బొత్స విద్యాశాఖ మంత్రిగా ఉండి నోటిఫికేషన్ ఇవ్వలేని దద్దమ్మ ఇప్పుడు మండలిలో మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే కోర్టులో కేసులు వేయించారు. కోర్టులు కూడా వారిని మందలించాయి” అని అన్నారు. డీఎస్సీ నియామక పుస్తకాన్ని చూపుతూ “దీన్ని వారికి పంపిస్తాం. నాలుగు రోజులు డీఎస్సీపైనే చర్చ పెట్టండి. అనుమానాలన్నింటికీ సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధం” అని సవాల్ విసిరారు.

దీనిపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ “అచ్చెన్నాయుడు భాష బాగోలేదు. దద్దమ్మ అని అన్నారు. మనిషి పెరిగితే బుద్ధి రాదు. భాష గౌరవంగా ఉండాలి. ఆ మాటలను రికార్డు నుంచి తొలగించాలి. డీఎస్సీలో అవకతవకలపై చర్చ జరగాలన్నది మా డిమాండ్” అని అన్నారు. వైకాపా ఎమ్మెల్సీలు “ఆంబోతు అచ్చెన్న వెంటనే క్షమాపణ చెప్పాలి” అంటూ నినాదాలు చేశారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ “పెద్దల సభలో వైకాపా సభ్యులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఛైర్మన్ స్థానానికి వచ్చి సభ అడ్డుకోవడం సరికాదు. సభను ఆర్డర్‌లో పెట్టాలి” అని విమర్శించారు. అచ్చెన్నాయుడు తిరిగి స్పందిస్తూ “దద్దమ్మ అనే పదం అన్‌పార్లమెంటరీ అయితే క్షమాపణ చెబుతాను. డీఎస్సీ నిర్వహించడం బొత్సకు చేత కాలేదు కాబట్టి అన్నాను. వ్యవసాయం, ఎరువుల అంశాలపై కూడా చర్చకు సిద్ధం” అని సవాల్ విసిరారు.

మొత్తంగా డీఎస్సీ అంశం మండలిలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.

Tags: