Minister Payyavula: శాసనమండలిలో డీఎస్సీపై వైకాపా అల్లరి.. మంత్రి పయ్యావుల తీవ్ర విమర్శ
మంత్రి పయ్యావుల తీవ్ర విమర్శ
Minister Payyavula: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రెండో రోజు కూడా డీఎస్సీ అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేది వైకాపా సభ్యుల ఉద్దేశంగా కనిపిస్తోందని శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించారు.
మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వైకాపా సభ్యులు వాయిదా తీర్మానం సమర్పించారు. దాన్ని తిరస్కరించిన ఛైర్మన్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయితే వైకాపా సభ్యులు ఛైర్మన్ పోడియం చుట్టూ చేరి ఆందోళనకు దిగారు.
ప్రశ్నోత్తరాల సమయంలోనే విపక్ష నేత బొత్స సత్యనారాయణకు మాట్లాడే అవకాశం కల్పించారు. డీఎస్సీపై చర్చ కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని బొత్స ప్రశ్నించారు. వేరే ఫార్మాట్‌లో రావాలని ఛైర్మన్ చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం ఎలా నడపాలనేది ప్రజలు నిర్ణయించారని, ప్రజాతీర్పు ప్రకారమే సభను నిర్వహిస్తున్నామని పయ్యావుల స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎల్‌నినో సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముందుగా ఆ అంశంపై చర్చించి, డీఎస్సీపై తర్వాత మాట్లాడతామన్నారు. డీఎస్సీ చాలా ముఖ్యమైన విషయమని బొత్స వాదించినప్పుడు పయ్యావుల తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. “డీఎస్సీ అంటేనే తెలుగుదేశం. మేము 14 సార్లు డీఎస్సీ ఇచ్చాం. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని బొత్స ఇప్పుడు డీఎస్సీపై, నిరుద్యోగులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరం” అని ఆయన సూటిగా చెప్పారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ డీఎస్సీపై శాసనసభలో మాట్లాడి, మండలిలో చర్చించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవ విషయాలు శాసనసభ మాదిరిగానే మండలిలోనూ చర్చించాలని, మెగా డీఎస్సీపై చర్చకు సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఏసీలో చర్చించి ఏయే అంశాలు చర్చకు పెట్టాలో నిర్ణయించాలని ఛైర్మన్ మోషేన్‌రాజు సూచించారు. వైకాపా సభ్యుల నినాదాల మధ్య సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.