Horrific Road Accident in Markapuram District: మార్కాపురం జిల్లాలో భయంకర రోడ్డు ప్రమాదం: హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌తో ఢీకొని దగ్ధం.. 13 మంది సజీవ దహనం
హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌తో ఢీకొని దగ్ధం.. 13 మంది సజీవ దహనం
Horrific Road Accident in Markapuram District: ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు దుర్ఘటన చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టడంతో రెండు వాహనాల్లోనూ భయంకర మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటన గురువారం ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య జరిగింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరి వైపు వెళ్తున్న బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వెనుక భాగంలో ప్రయాణిస్తున్నవారు బయటకు రాలేకపోవడంతో సజీవ దహనం కాగా, ముందు భాగంలో ఉన్నవారు ఏదోవిధంగా ప్రాణాలతో తప్పించుకున్నారు. ప్రమాదంతో బస్సు, టిప్పర్ రెండూ పూర్తిగా దగ్ధమయ్యాయి.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 28 మందిని మార్కాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
మృతుల వివరాలు:
సీహెచ్ మనోజ్‌కుమార్ (18), వింజమూరు
సీహెచ్ సుజాత (45), వింజమూరు
సీహెచ్ మేఘన (19), వింజమూరు
టి. నరేంద్ర (25), నల్లగొండ్ల
టి. చందన (21), నల్లగొండ్ల
టి. చందు (6), నల్లగొండ్ల
కె. ప్రకాశ్ (17), అయ్యవారిపల్లె
కె.అయ్యన్న (18), ఎర్రబొట్లపల్లె
వి. గురవయ్య (60), చింతగుంట్ల
కె.అబ్రహం (42), చోడవరం
పి.మహేంద్రరెడ్డి (17), చోడవరం
రామచంద్ర ప్రవీణ్ (21), చోడవరం
ఎ.సౌజన్య (22), పెదారికట్ల
మృతుల్లో చాలా మంది కనిగిరి, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందినవారు. ఘటనాస్థలాన్ని మార్కాపురం జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి:
ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాద కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.