పర్మిట్ రూమ్‌లకు మహిళా మంత్రులు ఎలా ఒప్పుకున్నారు..?
రద్దు చేయాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి డిమాండ్;
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. కేవలం ఏడాది కాలంలోనే 9 శాతం అమ్మకాలు పెరిగితే, రెండో ఏడాది మొదలైన మూడు నెలల్లోనే 24 శాతం లిక్కర్ అమ్మకాలు, 129 శాతం బీర్ల అమ్మకాలు పెరిగిపోయాయని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయన్నారు. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక పర్మిట్ రూమ్‌లను, 43 వేల బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశారని వరుదు కళ్యాణి గుర్తు చేశారు. 33 శాతం మద్యం షాపులను తొలగించేశారని చెప్పారు. ప్రభుత్వమే మద్యం అమ్మడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి రూ.5 లక్షలు కడితే పర్మిట్ రూమ్‌లకు పర్మిషన్ ఇచ్చేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం దారుణమని కళ్యాణి వాపోయారు. సౌకర్యవంతంగా మద్యం తాగడానికి పర్మిషన్ ఇచ్చే పేరుతో మగాళ్ల ఆరోగ్యాన్ని పాడు చేసి కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మద్యం విక్రయాలు పెరిగి మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని నెత్తీనోరూ మొత్తుకుంటుంటే అవేవీ లెక్కచేయకుండా పర్మిట్ రూమ్‌లు పెంచాలనుకోవడం మహిళల జీవితాలతో ఆటలాడుకోవడమే అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మేం తీసుకున్న గొప్ప నిర్ణయమని మీ ఇంట్లో ఉన్న ఆడవారితో మంత్రులు చెప్పుకోగలరా అని కళ్యాణి నిలదీశారు. మహిళా మంత్రులు ఇలాంటి నిర్ణయానికి ఎలా అంగీకరించారో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే పర్మిట్ రూమ్‌లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.