Singaiah Death : నా భర్త మరణంపై అనుమానాలున్నాయి

Update: 2025-07-03 06:06 GMT
  • యాక్సిడెంట్‌ తర్వాత కూడా నా భర్త మాట్లాడారు
  • తన పేరు, ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పారు
  • ప్రమాదంలో ఆయనకు తగిలిన దెబ్బలు చిన్నవే
  • అంత బాగా ఉన్న ఆయన ఎలా చనిపోయారు?
  • అంబులెన్సులో కచ్చితంగా ఏదో జరిగినట్లనిపిస్తోంది
  • సింగయ్య భార్య లూర్దు మేరీ సంచలన ప్రకటన

తన భర్త మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని వైఎస్‌.జగన్‌ పర్యటన సందర్భంగా వాహన ప్రమాదంలో మృతి చెందిన సింగయ్య భార్య లూర్ధు మేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత జూన్‌ 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌జగన్మోహనరెడ్డి రెంటపాల పర్యటన సందర్భంగా వాహన ప్రమాదంలో సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు సింగయ్య భార్య లూర్ధు మేరి తన కుమారులతో కలసి వైఎస్‌.జగన్‌ ని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ప్రమాదంలో తన భర్తకు చిన్న చిన్న గాయలే అయ్యాయని, ప్రమాదం జరిగిన తరువాత కూడా సింగయ్య తన పేరు, ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు కూడా స్పష్టంగా చెప్పారని మేరీ చెప్పారు. అంత బాగా ఉన్నాయన ఎలా చనిపోయారని ఆమె ప్రశ్నించారు. అంబులెన్సులో ఖచ్చితంగా ఏదో జరిగినట్లు ఉందని సింగయ్య భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు జగనన్న మా ప్రాంతానికి వస్తున్నారని తెలిసి మేమంతా ఆయన్ను చూడటానికి వెళ్లామని, అయితే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో మేము కాస్తా దూరంలోనే ఉండిపోయామని సింగయ్య భార్య మీడియాకు వివరించారు. కాసేపటి తరువాత నా భర్తకు యాక్సిడెంట్‌ అయ్యిందని తెలిసినట్లు చెప్పారు.

మా ఆయన చనిపోయిన తర్వాత మా ఇంటికి పోలీసులు వచ్చి యాక్సిడెంట్‌ వీడియోలు చూపారు. ఆ తర్వాత దాదాపు 50 మంది టీడీపీ మనుషులు కూడా మా ఇంటికి వచ్చి.. లోకేష్‌ పంపారు, మేం కూడా మీ కులస్తులం, ఎస్పీలమే అని చెప్పారు. ఇంకా ఏవేవో మాట్లాడి ప్రలోభపెట్టాలని చూశారు. అందుకే మా ఆయన మరణంపై మాకు అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం తర్వాత మా ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వైయస్సార్‌సీపీ నాయకులు సిద్ధమైతే, పోలీసులు బలవంతంగా అంబులెన్సు వచ్చే వరకు ఆపారు. ఆటో లేదా మరే వాహనంలో సింగయ్యను ఆస్పత్రికి తీసుకుపోవద్దని, కచ్చితంగా అంబులెన్సులోనే తీసుకెళ్లాలని పోలీసులు బలవంతం చేశారు. అందుకే ఆ అంబులెన్సులోనే ఏదో జరిగిందని మాకు బలమైన అనుమానాలు వస్తున్నాయని సింగయ్య భార్య లూర్ధమేరీ మీడియా ముందు తన ఆవేదన వెళ్లగక్కారు.

Tags:    

Similar News