Vijayasai Reddy: నమ్మకద్రోహినైతే సజ్జల మాదిరి సంధి చేసుకునేవాడిని.. విజయసాయి రెడ్డి ఘాటు కౌంటర్
విజయసాయి రెడ్డి ఘాటు కౌంటర్
Vijayasai Reddy: వైఎస్సార్‌సీపీలో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను నమ్మకద్రోహిగా చిత్రీకరిస్తున్న వైకాపా కోటరీ నాయకులపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా బహిరంగ లేఖ విడుదల చేశారు.
“నేను నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకునేవాడిని. సీబీఐ, ఈడీ చార్జ్‌షీట్లలో నా పేరు లేకుండా చేసుకునేవాడిని” అని విజయసాయి స్పష్టం చేశారు. జగన్‌కు నమ్మకస్తుడిగా ఉన్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తనను పలు కేసుల్లో చేర్చిందని పేర్కొన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే తాను 15 నెలలు కారాగార జీవితం గడిపానని గుర్తు చేశారు.
తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్‌లో ఏ-5గా, కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2గా చేర్చారని ఆరోపించారు. సకల శాఖల మంత్రి పేరు మాత్రం ఇంతవరకు ఏ చార్జ్‌షీట్‌లోనూ లేదని వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికల విజయం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం పార్టీలో పెరిగిందని, ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని విమర్శించారు. జగన్‌ను ఎవరూ కలవకుండా గోడ కట్టింది సజ్జలేనని, కుటుంబ సభ్యులు కూడా ఆయనకు దూరం కావడానికి కారణమని ఆరోపించారు.
కోటరీ నాయకుడి వల్ల అవమానాలు భరించలేక, ఆత్మగౌరవం చంపుకొని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. జగన్‌కు వెన్నుపోటు పొడిచి కేసులు లేకుండా చేసుకోవడం తనకు తెలియదని, కోవర్టు రాజకీయాలు తనకు చేతకావని స్పష్టం చేశారు. కోటరీ నాయకుడి చేతిలో జగన్ బందీ అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైకాపా అంతర్గత రాజకీయాల్లో మరోసారి ఘర్షణ తలెత్తినట్లు ఈ పరిణామం సూచిస్తోంది.